kotamreddy Fires On YCP: రాజకీయ సునామీ రాబోతుంది.. వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందన్న కోటంరెడ్డి
25 March 2023, 13:21 IST
MLA Kotamreddy Sridhar reddy News: వైసీపీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందన్నారు.
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Sridhar reddy Comments: వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన…. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ జరిగిందన్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ విషయాలు తెలుసంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని సజ్జలకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఆత్మప్రభోదానుసారం ఓటేశానని స్పష్టం చేశారు. సజ్జల వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి కోరారు. తాను వైసీపీ సభ్యుడే కాదని సజ్జల ఇంతకుముందే చెప్పారని కోటంరెడ్డి గుర్తు చేశారు. టీడీపీ డబ్బులు ఇచ్చిందంటూ మాట్లాడటం సరికాదన్నారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్నికోట్లు ఇచ్చారని సజ్జలను కోటంరెడ్డి ప్రశ్నించారు.
2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వతంగా డస్మిస్ అవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీలోకి చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని చెప్పారు. ప్రజాసమస్యలను ప్రస్తావించే తనపై నిఘా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల కిందటే తాను బయటికి వచ్చానని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారని కామెంట్స్ చేశారు. అవకాశం చూసుకొని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు..
పెత్తందారీ విధానం నడుస్తోంది....
పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటంపై కూడా కోటంరెడ్డి శుక్రవారం స్పందించారు. తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదనిఅభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని.., పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని దుయ్యబట్టారు.
4 MLAs Suspended From YSRCP: వైసీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‍కు పాల్పడినందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ…. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపామన్నారు. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. తమకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వస్తోందని చెప్పారు. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వాళ్లు సందర్బం చూసుకుని పార్టీకి వ్యతిరేకంగా నడుచుకున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలాంటి విషయాల్లో తమ పార్టీ సాగదీత ధోరణి అవలంభించవద్దని అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం జరిగింది అలా కాదన్నారు. పార్టీ మీద విశ్వాసం లేని వాళ్లు వెళ్లటంతో ఎలాంటి నష్టం లేదన్నారు సజ్జల. నలుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పూర్తి స్థాయిలో నమ్మిన తర్వాతే... నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ చంద్రబాబుకు అలవాటే అని దుయ్యబట్టారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని సదరు సభ్యులు ఖండించవచ్చు కానీ... వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పార్టీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని చెప్పారు.