Amaravati Real Estate : అమరావతిపై పొంగులేటి వ్యాఖ్యల్లో వాస్తవమేంత? ఏపీలో రియల్ ఎస్టేట్ పరిస్థితేంటి?
18 December 2024, 13:31 IST
Amaravati Real Estate : అమరావతిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయా? తగ్గాయా? వాస్తవ పరిస్థితులేంటి? అమరావతిలో రియల్ బూమ్ వాస్తవమేనా చూద్దాం.
అమరావతిపై పొంగులేటి వ్యాఖ్యల్లో వాస్తవమేంత? ఏపీలో రియల్ ఎస్టేట్ పరిస్థితేంటి?
Amaravati Real Estate : "ఇటీవల అమరావతిలో వచ్చిన వరదలతో ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదు. వరదలతో ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుంది. ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుందనేది ప్రచారం మాత్రమే. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. హైదరాబాద్, బెంగళూరుకు పెట్టుబడిదారులు వస్తున్నారు" అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.
పట్టాలెక్కిన అమరావతి రాజధాని
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గుతున్నాయని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పోకడలే కారణమని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఏపీలో అమరావతి పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమరావతిపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడడంతో...అమరావతికి మళ్లీ ఊతం లభించింది. గత ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని రాజధాని ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, అమరావతి ప్రజల్లో కొత్త ఆశ చిగురించింది. ఇది కొంత వరకూ వాస్తవమే. అయితే రాత్రికి రాత్రే మారిపోయి, పెట్టుబడిదారులు క్యూ కట్టే పరిస్థితులు అమరావతిలో లేవనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిపై దృష్టి పెట్టి మొదటిగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక సంకేతం పంపింది. సీఆర్డీఏను రంగంలోకి దింపి రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
అమరావతి పనులు
ఇటీవల సీఆర్డీఏ భేటీలో రూ.24,276 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతిలో మొత్తంగా రూ.45,249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ నిర్మాణాలు, రాజధాని లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం ఖర్చు రూ.62 వేల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అమరావతి పనులకు కసరత్తు ప్రారంభం కావడంతో...రియల్ ఎస్టేట్ వ్యాపారుల చూపు అటుగా మళ్లింది. గతంలో కంటే భూముల రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి రోడ్లు తప్ప ఇతర మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో...భవిష్యత్ అవసరాలకు మాత్రమే భూములు కొనుగోలు చేస్తున్నారు.
మరో 18 నెలల్లో మరింత పైకి
'అమరావతి, చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు సుమారు 50,000 ఎకరాల వరకు అందుబాటులో ఉన్నాయి. గతంలో చదరపు గజం రూ. 15,000 ట్రెండ్ అవ్వగా...ఇటీవల చదరపు గజం రూ. 25,000 ధరకు చేరింది' అని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నారు. రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభం అయ్యిందని, వార్షిక ప్రాతిపదికన భూముల రేట్లు పెరిగే అవకాశం ఉందని రియల్ వ్యాపారులు భావిస్తున్నారు. మరో 18 నెలల్లో భూముల ధరలు రెట్టింపు అవుతాయని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న కొన్ని భవనాల పనులు ప్రారంభించిందని, వీటిలో 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, బ్యూరోక్రాట్‌లు, శాసనసభ్యులు, న్యాయమూర్తుల నివాస గృహాలు ఉన్నాయని సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు
భవిష్యత్ లో
హైదరాబాద్, బెంగళూరులో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో... భవిష్యత్ అవసరాల కోసం కొందరు అమరావతి వైపు వస్తున్నారని రియల్ వ్యాపారులు అంటున్నారు. జనవరి2025 నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లతో పోటీ పడుతూ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణాలు సకాలంలో అందితే అమరావతి రియల్ రంగంలో మరింత స్పీడ్ అందుకుంటుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు. అమరావతిలో ఇప్పటికే కొన్ని పనులను పునఃప్రారంభం కావడంతో భూముల ధరలకు రెక్కలు వస్తు్న్నాయి. స్థానిక రియల్టర్ల ప్రకారం అమరావతి గ్రామాలలో భూముల ధరలు 60% నుంచి 100% వరకు పెరిగి చ.గజం రూ. 50,000 తాకవచ్చని తెలుస్తోంది.
10 ఏళ్లలో భూముల ధరలు
గత 10 ఏళ్లలో అమరావతి రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో కుదుపులు చూసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అప్పటి సీఎం చంద్రాబబు అమరావతిని రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ధరలు అమాంతం తగ్గిపోయాయి. అమరావతిలో 2019లో చదరపు గజానికి రూ.25,000-రూ.40,000 వరకు ఉండగా..జగన్ ప్రభుత్వ హయాంలో వీటి ధరలు రూ.9,000-రూ.18,000కి పడిపోయాయని ఓ రియాల్టీ వ్యాపారి అన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో అమరావతి భూముల ధరలు పెరుగుతున్నాయి. మొత్తం 29 గ్రామాల్లో ఎకరాకు రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
పెట్టుబడిదారుల్లో ఆసక్తి
భూముల ధరలు భారీగా పెరగడంతో అమరావతిపై పెట్టుబడిదారులకు ఆసక్తి ఉందని తెలుస్తోంది. వెలగపూడి, కొండంపాలెం, వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలకు సమీపంలోని ప్రాంతాల్లో వాణిజ్య, నివాస ప్రాజెక్టుల ధరలు భారీగా పెరుగుతున్నాయని స్థానికి డెవలపర్స్ చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో, హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు ఏపీకి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, రాబోయే కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో ఆశాజనక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని అమరావతి రియల్ వ్యాపారులు అంటున్నారు.
అమరావతి రియల్ ఎస్టేట్ ప్రభావం హైదరాబాద్ పడుతుందనే ఆలోచనలో తెలంగాణ మంత్రి పొంగులేటి...నెగిటివ్ కామెంట్స్ చేసి ఉంటారని కొందరు వ్యాపారులు అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కూడా వరద పరిస్థితులు కనిపిస్తున్నాయని, చెన్నై, బెంగళూరులో సైతం వర్షాలు చాలా ప్రాంతాలు నీటి మునుగుతున్నాయని చెబుతున్నారు. పొంగులేటి వ్యాఖ్యలను రాజకీయ కోణంలోనే చూడాలని టీడీపీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు పొంగులేటి అమరావతి ప్రస్తావన తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. అమరావతితో పాటు సాగర నగరం విశాఖలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.