Nara Lokesh On YS Jagan : మీ కపట నాటకాలకు కాలం చెల్లింది - మీ హెచ్చరికలకు భయపడం - మంత్రి లోకేశ్ కౌంటర్
18 July 2024, 14:30 IST
- Minister Nara Lokesh On YS Jagan : వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందంటూ విమర్శించారు.
వైఎస్ జగన్ పై మంత్రి లోకేశ్ ఫైర్
Nara Lokesh On YS Jagan : వినుకొండలో జరిగిన యువకుడి హత్య నేపథ్యంలో ఏపీలో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ హత్యను వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్...తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా?..” అని నారా లోకేశ్ ప్రశ్నించారు.
నేరాలు చేసి...మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లిందని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామన్న ఆయన… ఏ ఘటననూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. “ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదు...ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది” అంటూ జగన్ కు లోకేశ్ బదులిచ్చారు.
యువకుడి హత్య - జగన్ ట్వీట్….
బుధవారం రాత్రి వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే రషీద్ అనే యువకుడిని జిలానీ అనే యువకుడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, హత్యలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
వినుకొండలో జరిగిన హత్య నేపథ్యంలో బెంగుళూరు పర్యటనలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పర్యటను అర్థాంతరంగా ముగించుకుని ఏపీకి బయల్దేరారు. మధ్యాహ్నం మూడుగంటలకు విజయవాడ చేరుకోనున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. - ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, - వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టఅని ట్వీట్‌లో పేర్కొన్నారు.
నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని, సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని జగన్ ఆక్షేపించారు.
నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకి విజ్క్షప్తి చేస్తున్నానన్నారు.
వినుకొండలో యువకుడి హత్య నేపథ్యంలో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ హత్యకు టీడీపీనే కారణమని వైసీపీ అంటుంటే…. తమకు ఈ హత్యతో సంబంధం లేదని టీడీపీ చెబుతోంది. మరోవైపు వైఎస్ జగన్…. రేపు వినుకొండలో పర్యటించనున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.