Ys Jagan Returns: వినుకొండ హత్య నేపథ్యంలో బెంగుళూరు నుంచి తాడేపల్లికి బయల్దేరిన జగన్-jagan left for tadepalli from bangalore in the wake of vinukondas murder ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Returns: వినుకొండ హత్య నేపథ్యంలో బెంగుళూరు నుంచి తాడేపల్లికి బయల్దేరిన జగన్

Ys Jagan Returns: వినుకొండ హత్య నేపథ్యంలో బెంగుళూరు నుంచి తాడేపల్లికి బయల్దేరిన జగన్

Sarath chandra.B HT Telugu
Jul 18, 2024 02:19 PM IST

Ys Jagan Returns: పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్య నేపథ్యంలో మాజీ సిఎం జగన్‌ బెంగుళూరు నుంచి తాడేపల్లి బయల్దేరారు. వైసీపీ కార్యకర్తను దారుణంగా నరికి చంపడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

బెంగుళూరు నుంచి తిరుగు ప్రయాణమైన వైఎస్ జగన్
బెంగుళూరు నుంచి తిరుగు ప్రయాణమైన వైఎస్ జగన్

sarYs Jagan Returns: పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్య ఘటన నేపధ్యంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు. బుధవారం రాత్రి వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే రషీద్‌ అనే యువకుడిని జిలానీ అనే యువకుడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, హత్యలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.

yearly horoscope entry point

మరోవైపు వినుకొండలో హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని టీడీపీ చెబుతోంది. ఒకే పార్టీకి చెందిన వారి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగిందని, ఇందులో రాజకీయ కోణం లేదని టీడీపీ చెబుతోంది. వినుకొండకు చెందిన రౌడీ షీటర్‌ అనుచరులు రషీద్, జిలానీలు ఉండే వారని మరో వాదన ఉంది. ఇటీవల జిలానీ కుటుంబానికి చెందిన ద్విచక్ర వాహనాన్ని రషీద్ దగ్ధం చేయడంతో పాటు అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని దూషించడంతోనే వివాదం తలెత్తిందని చెబుతున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే బుధవారం రాత్రి హత్య జరిగినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు చెబుతున్నారు.

వినుకొండలో జరిగిన హత్య నేపథ్యంలో బెంగుళూరు పర్యటనలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పర్యటను అర్థాంతరంగా ముగించుకుని ఏపీకి బయల్దేరారు. మధ్యాహ్నం మూడుగంటలకు విజయవాడ చేరుకోనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. - ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, - వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని, నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టఅని ట్వీట్‌లో పేర్కొన్నారు.

నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని, సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని, ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు.

దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకి విజ్క్షప్తిచేస్తున్నానన్నారు.

వైసీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని కార్యకర్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు వినుకొండకు వెళ్లి బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

Whats_app_banner