Pawan Kalyan : అర్జునుడు ఆడపడుచుల్ని రక్షించాడు, జగన్ సొంత చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తున్నారు - పవన్ కల్యాణ్
04 February 2024, 21:22 IST
- Pawan Kalyan : సొంత చెల్లిపై నీచంగా మాట్లాడిస్తున్న సీఎం జగన్ అర్జునుడితో పోల్చుకోవడం హాస్పాస్పదంగా ఉందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి
Pawan Kalyan : ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాలశౌరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ... సీఎం జగన్ తనని తాను అర్జునుడితో పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. అర్జునుడు తన ఆడపడుచుల్ని రక్షించాడు కానీ, ఎప్పుడూ తూలనాడలేదన్నారు. సొంత చెల్లి గురించి తన అనుచరులతో నీచంగా మాట్లాడిస్తున్నారన్నారు. సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వరు, బాబాయిని దారుణంగా చంపేసిన నిందితుల్ని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వివేకా కుమార్తె సునీత తన ప్రాణ హాని ఉందని భయపడుతున్నా ఆమె రక్షణ ఇవ్వడంలేదన్నారు. ఇలాంటి సీఎం జగన్(CM Jagan) అర్జునుడితో పోల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎలాంటి వాళ్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. పవర్ స్టార్‌గా కంటే ప్రజల కోసం పనిచేసే కూలీగానే గర్వపడతానన్నారు. అడ్డదారుల్లో అడ్డగోలుగా సంపాదించాలని ఏనాడూ అనుకోలేదన్నారు. అబద్ధాలు చెప్పనన్న జగన్... అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు అన్నారు, మెగా డీఎస్సీతో పాటు అనేక హామీలు ఇచ్చారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. జగన్ అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన రోజు త్వరలోనే వస్తుందన్నారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడని, రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడన్నారు. మనందరం కలిసి దుర్మార్గపు పాలనను అంతం చేయాలని పవన్ పిలుపు నిచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
అమరావతే రాజధాని అని మాట మార్చారు- ఎంపీ బాలశౌరి
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ బాలశౌరి...జనసేన(Janasena)లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించిందన్నారు. కానీ గడచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోయానన్నారు. పవన్ తో ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. దమ్ము, ధైర్యంతో గొంతు ఎత్తి ప్రశ్నించే వ్యక్తి పవన్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాలశౌరి(Balasouri) ఆరోపించారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఓట్లు అడిగి అధికారంలోకి రాగానే మాట మార్చారని ఎంపీ బాలశౌరి సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
పవన్ కల్యాణ్ తోనే నా రాజకీయ జీవితం
కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం(Siddham) మీటింగ్ లు, హోర్డింగ్స్ పెడుతున్నారని ఎంపీ బాలశౌరి ఆరోపించారు. ఇంతకీ వైసీపీ దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా? అని ఎద్దేవా చేశారు. 2019లో అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఓట్లు అడిగింది గుర్తులేదా? అని ప్రశ్నించారు. 2024లో వైసీపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో చెప్పాలన్నారు. దేవుడు సీఎం జగన్(CM Jagan) ఒక్కరికే కాదు, వైఎస్ షర్మిల(YS Sharmila), సునీత(Sunitha)కు కూడా ఉన్నారన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ(Ysrcp)లో ఏం జరిగాయో తనకు అన్నీ తెలుసన్న బాలశౌరి...రానున్న రోజుల్లో అన్నీ వివరిస్తానన్నారు. తన రాజకీయ జీవితం ఇకపై పవన్ కల్యాణ్ తోనే అన్నారు. జనసేనలో తనకు ఏ బాధ్యత అప్పగించినా ఒక సైనికుడిలా పని చేస్తానన్నారు.