తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tourism : ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్న పర్యాటకులు.. ఇదే అదునుగా దోచేస్తున్న వ్యాపారులు!

AP Tourism : ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్న పర్యాటకులు.. ఇదే అదునుగా దోచేస్తున్న వ్యాపారులు!

20 October 2024, 12:59 IST

google News
    • AP Tourism : అరకు అందాలను ఆస్వాదించడానికి టూరిస్టులు తరలివస్తున్నారు. ఈ సీజన్‌లో మంచు, పచ్చదనం, సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో.. స్థానికంగా వ్యాపారం చేసేవారు అందినకాడికి దండుకుంటున్నారు. గదుల అద్దెలు మొదలు.. అన్నింటి రేట్లు పెంచేసి అక్రమంగా సంపాదిస్తున్నారు.
వంజంగిలో పర్యాటకులు
వంజంగిలో పర్యాటకులు (@santhoshksk24)

వంజంగిలో పర్యాటకులు

ప్రకృతిసిద్ధమైన అందాలకు విశాఖ జిల్లా ఏజెన్సీ పెట్టింది పేరు. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయ, సమీపంలో ఉండే బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాలకొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఏడాది సీజన్‌ మొదలుకావడంతో.. సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. పర్యాటకులు ఉండే రిసార్టులు, హోటళ్ల నిర్వహణపై అధికారులు ఆరా తీస్తున్నారు. టూరిస్టుల దగ్గర వసూలు చేస్తున్న ఛార్జీలకు తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేస్తున్నారు. హోటళ్ల వద్ద గదుల అద్దె వివరాలను స్పష్టంగా ప్రకటించాలని చెబుతున్నారు. క్యాంపింగ్‌ టెంట్‌లకు పంచాయతీ, విద్యుత్తు సంస్థల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

బొర్రా గుహలు, అరకులోయ, వంజంగి మేఘాలకొండ, జలపాతాలు, తాజంగి, లంబసింగి వంటి ప్రదేశాల్లో రిసార్టులు, హోటళ్లు, అతిథి గృహాలకు మరమ్మతులు చేపడుతున్నారు. పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ఏపీ టూరిజం రిసార్టుల్లోనూ సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. టూరిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

పాడేరు ఏజెన్సీలో పర్యాటక సీజన్‌ 6 నెలల పాటు ఉంటుంది. ఇక్కడున్న సుందరమైన, ప్రకృతిసిద్ధ అందాలు, జలపాతాలు, ఇతర ప్రదేశాలను వీక్షించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మాహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తుంటారు. వీరికి ఆతిథ్యం కల్పించేందుకు పర్యాటక శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో సరైన రిసార్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజ్‌లు అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటు హోటళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.

ఇదే అదునుగా ప్రైవేటు రిసార్టులు, హోటళ్ల యాజమాన్యాలు అదనపు వసూళ్లు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వసూలు చేస్తున్న డబ్బులకు తగ్గట్లుగా సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం లేదని టూరిస్టుల నుంచి ఫిర్యాదులున్నాయి. సాధారణంగా వెయ్యి రూపాయలకు దొరికే గదికి.. ఈ సీజన్‌లో రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. వీటి నియంత్రణపై కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఫోకస్ పెట్టారు.

తదుపరి వ్యాసం