AP Govt : ఇకపై అర్ధరాత్రి వరకూ హోటళ్లు ఓపెన్
ఇకపై ఏపీలో అర్ధరాత్రి వరకూ.. హోటళ్లు, రెస్టారెంట్ల, ఫుడ్ బిజినెస్ తెరుచుకోనున్నాయి. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వ్యాపార సమయాలను పెంచుకునేందుకు వెసులుబాడు కల్పించింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంచొచ్చని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు జారీ చేశారు.
రెండేళ్లుగా కరోనా పరిస్థితుల దృష్ట్యా రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే హోటళ్లు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలో నిబంధనలు విధించింది. అయితే కొవిడ్ కేసులు.. తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు మారిపోవడంతో.. వ్యాపార వేళలు పొడిగించేందుకు.. అనుమతులు ఇచ్చింది. అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా.. నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగిసింది. తాజాగా విడుదల చేసిన కొత్త ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే కరోనా జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాల్సిందేనని ప్రభుత్వం చెప్పింది. వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా.. మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని తెలిపింది.
2020 మార్చిలో కరోనా కారణంగా.. దేశం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వైరస్ భారిన పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో కోవిడ్ ఆంక్షలు విధించాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పరిశ్రమలు, వ్యాపారలతో పాటు అన్ని చోట్ల ఆంక్షలు పెట్టారు. రాత్రి 10.30 గంటలకే హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లోకి వచ్చింది. ఈ కారణంగా అర్ధరాత్రి వరకు అనుమతులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
టాపిక్