Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. పార్కింగ్ ఫీజు వసూలుకు ముహూర్తం ఫిక్స్!-parking fee will be charged at nagole and miyapur metro stations from october 6 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. పార్కింగ్ ఫీజు వసూలుకు ముహూర్తం ఫిక్స్!

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. పార్కింగ్ ఫీజు వసూలుకు ముహూర్తం ఫిక్స్!

Basani Shiva Kumar HT Telugu
Sep 30, 2024 06:19 PM IST

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో.. పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. ప్రయాణికుల వాహనాలకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో (@ltmhyd)

అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నుండి.. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ రుసుములను వసూలు చేస్తామని.. మెట్రో ప్రతినిధులు ప్రకటించారు. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

హైదరాబాద్‌ మెట్రో రైలు ఆఫర్లను కూడా పొడిగించారు. 2025 మార్చి 31 వరకు ఎల్‌అండ్‌టీ ఆఫర్లు పొడిగించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్ ఆఫర్లు పొడిగిస్తూ.. ఎల్‌అండ్‌టీ నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు..

1.ప్రయాణికుల కోసం బయో టాయిలెట్లు

2.సాయంత్రం వేళల్లో తగిన వెలుతురు కోసం లైట్ల ఏర్పాటు

3.24/7 భద్రత, సీసీటీవీలు ఏర్పాటు

4.లావాదేవీల సౌలభ్యం కోసం యాప్, క్యూఆర్ కోడ్ చెల్లింపు వ్యవస్థ

5.స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

6.సులభమైన పార్కింగ్, యాక్సెస్ కోసం లేన్ గుర్తింపు

7.మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

8.సమీప ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ వంటి అత్యవసర సంప్రదింపు వివరాల ప్రదర్శన

పార్కింగ్ ఫీజు గురించి ఎల్‌అండ్‌టీ ఎండీ, సీఈవో కెవిబి రెడ్డి మాట్లాడుతూ.. 'కొత్త పార్కింగ్ సౌకర్యాలను పరిచయం చేయటం, మా ప్రయాణీకులకు మరింత కాలం పాటు మా ఆఫర్‌ల ప్రయోజనాలను అందించనుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాలు ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. హైదరాబాద్‌కు మరింత స్థిరమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము' అని వివరించారు.

ఎల్‌అండ్‌టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరదరాజన్ మాట్లాడుతూ.. 'మేము చేసే ప్రతి పని మా ప్రయాణీకుల సౌకర్యమే. వారి సౌకర్యాన్ని మరింత పెంచే లక్ష్యంగా పని చేస్తుంటాము' అని స్పష్టం చేశారు.