Cow Illegal Transport : ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు 47 గోవుల అక్రమ రవాణా-ఊపిరాడక 10 పశువులు మృతి
Cow Illegal Transport : ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా 47 గోవులను తరలిస్తుండగా కరీంనగర్ లో విశ్వహిందూ పరిషత్ సభ్యులు, పోలీసులు పట్టుకున్నారు. లారీలో కుక్కి కుక్కి తీసుకెళ్తుండడంతో ఊపిరి ఆడక 10 గోవులు మృతి చెందాయి. మరో 5 గోవులు మృత్యువుతో పోరాడుతున్నాయి.
Cow Illegal Transport : గోవుల అక్రమ రవాణా ఆందోళన గురి చేస్తుంది. పరిమితికి మించి లారీలో పశువులను తరలించడం కలకలం సృష్టిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తుండగా శ్వాస ఆడక మార్గమధ్యలో పది గోవులు ప్రాణాలు కోల్పోయాయి. మరో ఐదు పశువులు మృత్యువుతో పోరాడుతున్నాయి. పోలీసులు రైడ్ చేసి కరీంనగర్ జిల్లా రేణిగుంట టోల్ ప్లాజా వద్ద పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని పశువులను ఎల్ఎండీ కాలనీలోని మృత్యుంజయ గోశాలకు తరలించారు.
మూగజీవాల అరణ్య రోదన
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి అక్రమంగా హైదరాబాద్ కబేలాకు పశువుల తరలిస్తుండగా పట్టుబడ్డ పశువులు మౌనంగా రోదించాయి. కదలలేని స్థితిలో శ్వాస ఆడక కూలబడిపోయాయి. పోలీసులు వాటిని గోశాలకు తరలించగా పశువైద్యులు అక్కడికి చేరుకుని సెలైన్ లు పెట్టి వైద్యం అందించారు. అప్పటికే తీవ్ర అస్వస్థత గురై పది పశువులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదు పశువుల పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. పరిమితికి మించి వాహనాల్లో పశువులను కుక్కికుక్కి సుదూర ప్రాంతాలకు తరలించడం వల్లే అస్వస్థతకు గురయ్యాయి వైద్యులు తెలిపారు.
సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
గోవుల అక్రమ రవాణాను అడ్డుకుని పోలీసులకు అప్పగించిన విశ్వహిందూ పరిషత్ గో రక్షక్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి పశువుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోవులకు పశువుల వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించి కాపాడగలిగామని తెలిపారు. మరో 10 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని, ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ట్రక్కులో అధిక సంఖ్యలో ఆవులను బంధించి తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతి నిత్యం కొన్ని వందల ఆవులు, పశువులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రా లకు యధేచ్ఛగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్ష చట్టం ప్రకారం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పశువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆవులను పశువులను కాపాడాలని కోరారు. అన్ని జిల్లాల పోలీసు అధికారులు గోరక్షణకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గోవూలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం