Telangana Police : పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్.. మరీ ఇంత ఘోరమా?-telangana police constable started a fight between husband and wife for money ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Police : పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్.. మరీ ఇంత ఘోరమా?

Telangana Police : పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్.. మరీ ఇంత ఘోరమా?

Basani Shiva Kumar HT Telugu
Sep 24, 2024 03:23 PM IST

Telangana Police : తెలంగాణలో కొందరు పోలీసులు డబ్బు కోసం దిగజారిపోతున్నారు. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ డబ్బు కోసం భార్యభర్తల మధ్య గొడవ పెట్టించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని బాధిత వ్యక్తి డిమాండ్ చేస్తున్నారు.

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్ (Image Source: wikipedia)

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన స్నేహితురాలితో కలిసి జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగర్‌ కర్నూల్‌లోని మెయిన్ రోడ్డు పక్కన కారు ఆపి.. దాంట్లో భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ అటుగా వచ్చారు. కారులో ఉన్నవారి ఫొటోలు తీశారు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించి.. భయభ్రాంతులకు గురిచేశాడు.

అంతటితో ఆగకుండా.. తన దగ్గర ఉన్న ట్యాబ్‌లో నుంచి ఫొటో తొలగించాలంటే రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసు నమోదు చేస్తానని బెదిరించారు. దీంతో భయపడిన ఆ వ్యక్తి రూ.2 వేలు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వెంటనే తన స్నేహితుడి ఫోన్‌పేకి ఆ కానిస్టేబుల్‌ రూ.2 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అక్కడితో ఆగలేదు.

కానిస్టేబుల్ తీసిన ఆ ఫొటోను తొలగించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫొటోను బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్‌కు పంపించారు. అతను కూడా ఫొటోతో బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బాధితుడిని బెదిరించాడు. దీంతో చిరాకు వచ్చి.. బాధితుడు డబ్బులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. దీంతో కానిస్టేబుల్ ఆ ఫొటోను బాధితుడి భార్యకు చూపించాడు.

కానిస్టేబుల్ చేసిన ఈ పనితో.. భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీరి గొడవను పెద్దలు కూర్చొని సెట్ చేశారు. ఈ వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన గురించి నాగర్‌ కర్నూల్‌ సీఐ కనకయ్యకు తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే.. ఆ ఇద్దరి కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని సీఐ కనకయ్య స్పష్టం చేశారు.

ఈ విషయం తెలిసి బిజినేపల్లి ప్రజలు భగ్గుమంటున్నారు. పోలీసులు మరీ ఇంత దిగజారిపోయారేంటని చర్చించుకుంటున్నారు. ఇదొక్కటే కాదు.. పోలీసులు డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. సదరు కానిస్టేబుళ్ల బాధితులు చాలామంది ఉన్నారని అంటున్నారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Whats_app_banner