Brave Cop Yadayya: సాహసికి సమున్నత పురస్కారం, తెలంగాణ కానిస్టేబుల్‌‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం-supreme award for adventurer telangana constable yadaiah with presidential gallantry medal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brave Cop Yadayya: సాహసికి సమున్నత పురస్కారం, తెలంగాణ కానిస్టేబుల్‌‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం

Brave Cop Yadayya: సాహసికి సమున్నత పురస్కారం, తెలంగాణ కానిస్టేబుల్‌‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం

Sarath chandra.B HT Telugu
Aug 15, 2024 07:15 AM IST

Brave Cop Yadayya: విధి నిర్వహణలో కత్తిపోట్లకు గురై, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకున్న తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌‌కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్య పతకం కానిస్టేబుల్ యాదయ్యను వరించింది.

బుధవారం సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్ యాదయ్యను సన్మానిస్తున్న తెలంగాణ డీజీపీ
బుధవారం సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్ యాదయ్యను సన్మానిస్తున్న తెలంగాణ డీజీపీ

Brave Cop Yadayya: కేంద్ర హోంశాఖ ప్రకటించిన శౌర్య పురస్కారాల్లో ఈసారి తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్‌కు అత్యున్నత పురస్కారం వరించింది. పోలీస్ శాఖలో చేరిన వారు జీవితంలో ఒక్కసారైన అందుకోవాలని ఆరాటపడే పురస్కారాన్ని ఈ ఏడాది ఓ కానిస్టేబుల్‌ను వరించింది. రెండేళ్ళ క్రితం దొంగల్ని పట్టుకునే క్రమంలో ఏడు సార్లు కత్తిపోట్లకు గురైనా నిందితుడిని విడువకుండా పట్టుకున్న హీరో పోలీస్‌ను రాష్ట్రపతి శౌర్య పతకానికి ఎంపిక చేశారు.

గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని పట్టుకునే క్రమంలో సికింద్రాబాద్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌ యాదవయ్య కత్తిపోట్లకు గురయ్యాడు. నిందితుడు యాదయ్యను ఏడుసార్లు కత్తితో పొడిచి పారిపోయే ప్రయత్నం చేసినా అతడిని విడవకుండా పట్టుకున్నాడు. విధినిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు యాదయ్యను రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిపాదించింది.

యాదయ్య ధైర్య సాహసాలతో రాష్ట్రపతి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఈ ఏడాది ఈ పురస్కారం లభించిన ఏకైక పోలీస్ అధికారి కావడంతో డీజీపీ కార్యాలయంలో యాదయ్యను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం మాదాపూర్ సీసీఎస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చదువు యాదయ్యని డిజిపి డా.జితేందర్ ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.

సాధారణంగా రాష్ట్రపతి శౌర్య పతకాలు సాయుధబలగాలను మాత్రమే వరిస్తుంటాయి. ఉగ్రవాదం, తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొనే కేంద్ర సాయుధ బలగాలు, పోలీస్ దళాలను ఈ పురస్కారాలు వరిస్తుంటాయి. ఈ ఏడాది శాంతి భద్రతలను పర్యవేక్షించే సాధారణ కానిస్టేబుల్‌ను ఈ పురస్కారం వరించింది. కేంద్రం ప్రకటించిన జాబితాలో యాదయ్యకు చోటు దక్కడంతో తెలంగాణ డీజీపీ జితేందర్ తన కార్యాలయంలో బుధవారం యాదయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐపీఎస్‌లు పాల్గొన్నారు.

ఏం జరిగిందంటే…

సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌లోని మాదాపూర్‌లో 2022 జులై 25న ఓ వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ జరిగింది. కాత్యాయని (72) అనే వృద్ధురాలు ఇంటి దగ్గర్లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె అప్రమత్తమై గొలుసును పట్టుకోవడంతో కొంత భాగాన్ని మాత్రమే నిందితులు తెంచుకోగలిగారు.బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు రవి, దేబేశ్‌లతో కలిసి గాలింపు చేపట్టారు.

2022 జులై 23న మియాపూర్ నుంచి బొల్లారం వెళ్లే ఎక్స్ రోడ్డు వద్ద గొలుసు దొంగల కదలికల్ని గుర్తించారు. ముగ్గురు కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై వారిని పట్టుకోడానికి వెళ్లారు. కానిస్టేబుల్ రవి వెనుక యాదయ్య కూర్చు న్నారు. మరో వాహనంపై దేబేశ్ ఉన్నారు. బొల్లారం ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనంపై వెళుతున్న దొంగలను వారు గుర్తించారు. ఆ వాహనాలను వెంటాడి పట్టుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకోడాని ప్రయత్నిస్తుండగా నిందితులు తిరగబడ్డారు.

ద్విచక్ర వాహనాన్ని రాహుల్ (19) నడుపుతుండగా అతని వెనుక ఇషాన్ నిరంజన్ నీలమనల్లి (21) కూర్చున్నాడు. పోలీసులు పట్టుకున్నారని తెలియగానే ఇషాన్ కత్తితో దాడి చేశాడు. యాదయ్యను ఎడపెడా పొడిచేశాడు. ఈ ఘటనలో ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. యాదయ్యకు పొట్ట, ఛాతి, వీపు, ఎడమచెయ్యి ప్రాంతాల్లో కత్తిపోట్లకు గురయ్యాడు. రక్తం కారిపోతున్నా యాదయ్య అతడిని వదల్లేదు. ఈలోగా మిగతా ఇద్దరు పోలీసులు రాహుల్‌ను వెంటపడి పట్టుకున్నారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పటికే వైర్‌లెస్‌ సెట్‌లో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగల్ని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన యాదయ్య మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. పలుమార్లు శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితులు రాహుల్, ఇషాన్ ఎస్సార్‌ నగర్‌లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గొలుసు చోరీలతో పాటు అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. గతంలో కర్ణాటకలో పలు చోరీలు, నేరాలకు పాల్పడిటనట్టు గుర్తించారు. యాదయ్య సాహసాన్ని గుర్తించిన పోలీస్ ఉన్నతాధికారులు రాష్ట్రపతి శౌర్య పతకానికి సిఫార్సు చేయడంతో ఈ ఏడాది ఆయన పేరును హోంశాఖ ప్రకటించింది.