Siddipet : తల్లి అనుకోని మరో మహిళతో వెళ్లిన బాలుడు.. గంటల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు
Siddipet : తల్లితండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు.. మార్గమధ్యలో వేరొక మహిళను తన తల్లి అనుకోని ఆమెతో దిగిపోయాడు. ఆ బాలుడిని ఆటో డ్రైవర్ సహాయంతో.. పోలీసులు గుర్తించి గంటల వ్యవధిలోనే తల్లితండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మల్లేశం గౌడ్ వివరాల ప్రకారం.. ఉమా, పీటర్ దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు బెన్హర్‌తో కలిసి శనివారం సిరిసిల్ల నుండి సికింద్రాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్‌లో బస్సు ఆగింది. అప్పుడు బాలుడు బెన్హర్ మరో మహిళతో కలిసి బస్సు దిగాడు. తమ కొడుకు బస్సు దిగిన విషయం గమనించని తల్లిదండ్రులు బస్సులో వెళ్లిపోయారు.
టికెట్‌పై ఉన్న నెంబర్ సహాయంతో..
ఆ పిల్లవాడు మహిళ దగ్గర ఉండి ఏడుస్తుండగా.. పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ డయల్ 100 కు కాల్ చేసి చెప్పాడు. వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమై.. ఆ మహిళ వద్ద ఉన్న టికెట్స్ ఆటో డ్రైవర్‌తో వాట్సప్ చేయించుకున్నారు. టికెట్‌పై ఉన్న నెంబర్‌కు ఫోన్ చేయగా.. వేములవాడ డిపో మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేసి బస్సు నెంబర్, బస్సు కండక్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చాడు.
అనంతరం కంట్రోల్ రూమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ బిక్షపతి.. వెంటనే కండక్టర్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. కండక్టర్ కుకునూరుపల్లి వద్ద బస్సు ఆపి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని అడగ్గా.. బస్సు మొత్తం వెతికారు. దీంతో కండక్టర్ మీ బాబు ప్రస్తుతం సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ లో పోలీసుల వద్ద ఉన్నాడని తెలిపారు. తల్లిదండ్రులు వెంటనే తిరిగి సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్‌కు చేరుకున్నారు.
బాబును అప్పగించినందుకు..
పోలీసులు పూర్తి విచారణ జరిపి అబ్బాయిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ తప్పిదం వల్లే బాబు బస్సు దిగిపోయాడని.. బాబును క్షేమంగా అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. పోలీస్ కమిషనర్ అనురాధ కంట్రోల్ రూమ్ సిబ్బందిని అభినందించి, త్వరలో రివార్డ్ అందజేస్తామని చెప్పారు.
సంగారెడ్డిలో మరో ఘటన..
గుమ్మడుదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ గౌడ్ (30).. గుమ్మడిదల టోల్ ప్లాజా సమీపంలో దాబా నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం దాబాకు వెళ్లిన మల్లేష్.. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన భార్య మాధురి దాబాలో పనిచేస్తున్న వ్యక్తులకు ఫోన్ చేయగా.. 10 నిమిషాలు మాత్రమే వచ్చి వెళ్లాడని తెలిపారు. మరల ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబసభ్యులతో కలిసి చుట్టుపక్కల మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త అదృశ్యంపై మాధురి శనివారం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.