Krisham Raju Life Journey : మొగల్తూరు నుంచి సినిమాల్లోకి కృష్ణంరాజు జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
11 September 2022, 19:02 IST
- Rebel Star Krisham Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి తీరని లోటును మిగిల్చింది. తెలుగు సినీ పరిశ్రమంతా.. శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కృష్ణంరాజు జర్నీ మెుగల్తూరు నుంచి ఎలా మెుదలైంది?
ప్రభాస్ తో కృష్ణంరాజు
కృష్ణంరాజు మృతితో సినీ పరిశ్రమ కన్నీటి పర్యంతమవుతోంది. ఆయన అభిమానులు.. దు:ఖంలో మునిగిపోయారు. మెుగల్తూరు నంచి సాగిన ఆయన ప్రయాణం ఎంతో దూరం వెళ్లింది. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో పుట్టారు. కృష్ణంరాజుది రాజుల కుటుంబం. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. బాల్యంలో రాజులా గుర్రపు బండిలో బడికి వెళ్లేవారని ఇప్పటికీ కొంతమంది మెుగల్తూరు వాసులు చెబుతుంటారు.
నిజానికి సినిమాల్లోకి రావాలనే ఇంట్రస్ట్ పెద్దగా కృష్ణంరాజుకు లేదు. చూడటం వారకైతే ఆసక్తి చూపించేవారు. చిన్నప్పుడు మెుగల్తూరు జీవితం, ఆ తర్వాత వినోదం కోసం సినిమాలు చూసేవారు. బీకామ్ చదువుతున్న రోజుల్లో ఆంధ్రారత్న పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. చదవు పూర్తయ్యాక.. హైదరాబాద్ బాట పట్టారు. అబిడ్స్‌లో రాయల్ ఫొటోస్టూడియోను పెట్టారు.
అబిడ్స్‌లో ఒక రోజు కృష్ణంరాజు కాఫీ తాగుతున్నారు. అక్కాచెల్లెళ్లు మూవీ దర్శకుడు పద్మనాభ రావు కంటపడ్డారు. సినిమా హీరోలా ఉన్నావ్.. అని చెప్పారు. నటించేందుకు ఆసక్త ఉందా? అని అడిగారు. స్నేహితులు కూడా.. ఇదే మాట చెప్పడంతో సినిమాల్లోకి వెళ్లాలని కృష్ణంరాజుకు ఆలోచన వచ్చింది. ఆ తర్వాత మద్రాసుకు వెళ్లారు.
1966లో చిలుకా గోరింక సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు కృష్ణంరాజు. అలా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1967లో ఎన్టీఆర్ తో కలిసి.. శ్రీ కృష్ణావతారం సినిమాలోనూ నటించారు. ఆ తర్వాత.. గుర్తుండిపోయేలా ఎన్నో పాత్రలు చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుగా ఎదిగారు.
కృష్ణంరాజు 1992వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం ఎన్నికల్లో పోటీ చేశారు. 1998వ సంవత్సరంలో బీజేపీ నుంచి లోక్ సభ ఎన్నికలలో కాకినాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి లోక్‌సభ నుంచి పోటీ చేశారు. రెండో సారి విజయం సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు.
2004 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీని వీడిచిపెట్టి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో 2009 చేరారు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎంపీ సీట్ కు పోటీ చేసి కృష్ణంరాజు ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు బీజేపీలో చేరారు. ఎక్కడ ఉన్నా.. ఆయన చుట్టూ ఎలాంటి వివాదాలూ ఉండవు. అదే కృష్ణంరాజు గొప్ప వ్యక్తిత్వం.