BJP Focus : ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తహతహ…. త్వరలో అనూహ్య మార్పులు!-bjp focuses eye on main opposition slot in telugu states ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Focus : ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తహతహ…. త్వరలో అనూహ్య మార్పులు!

BJP Focus : ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తహతహ…. త్వరలో అనూహ్య మార్పులు!

B.S.Chandra HT Telugu
Sep 06, 2022 06:20 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తోంది. త్వరలో వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా అనూహ్య రాజకీయ పరిణామాలు జరగొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారే లక్ష్యంతో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం</p>
రెండు తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు పెంచింది. అధికారంలోకి రావడానికి ముందు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇన్నాళ్లు నంబర్ గేమ్‌లో మూడు, నాలుగు,ఐదు ఇలా చివరి స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు నంబర్‌ స్థానంపై కన్నేసింది. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పార్టీ నాయకత్వానికి అవసరమైన రూట్‌ మ్యాప్‌ను బీజేపీ అగ్రనేతలు ఇచ్చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో 2023, 24లో జరిగే తెలంగాణ, ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకపోవడానికి కారణాలను స్పష్టంగా విశ్లేషించుకున్న తర్వాత, పకడ్బందీ చికిత్సను బీజేపీ నాయకత్వం ప్రారంభించింది. ఎక్కడ తాము బలహీనంగా ఉన్నారో గమనించి అక్కడి నుంచే చికిత్స ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌భావం చూపే బలమైన సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న పారిశ్రామిక వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో టిఆర్‌ఎస్‌, వైసీపీలు అధికారంలోకి రావడంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. నిజానికి టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధమనే సంకేతాలను పంపినా ఈసారి బీజేపీ పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైన వెంటనే ఆ పార్టీకి చెందిన ముగ్గురు పారిశ్రామిక వేత్తలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌, సిఎం రమేష్‌లు బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబు ఆశీస్సులతోనే వారు బీజేపీలో చేరారని ప్రచారం జరిగింది. అప్పట్లో దానిపై బీజేపీ పెద్దగా స్పందించలేదు. ఇటీవల ఆ ముగ్గురిలో ఇద్దరి రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. సిఎం.రమేష్‌ ఒంటరి అయ్యారు.

దీంతో రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బలమైన సామాజిక వర్గానికి రాజకీయంగా అండను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి టీడీపీ దగ్గరవ్వాలని భావించినా, బీజేపీ మాత్రం మరోలా ఆలోచించినట్లు చెబుతున్నారు. టీడీపీ నాయకత్వాన్నే తమవైపుకు తిప్పుకోవాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్ని కులం కేంద్రంగానే సాగుతున్నాయి. ఓ బలమైన సామాజిక వర్గాన్ని టీడీపీ వైపుకు తిప్పకోవడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. పారిశ్రామిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న రాజకీయ నాయకులు బీజేపీలో చేరడమే మేలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవులపై ప్రచారం….?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రి వర్గంలోకి తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్‌ రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఎవరు ఊహించని వ్యక్తులకు మంత్రి పదవులు దక్కుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే దానిపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఏపీలో బీజేపీకి ప్రస్తుతం ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలంటే వారు బీజేపీలో అధికారికంగా చేరాల్సి ఉంటుంది. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రాంతీయ పార్టీ నుంచి ఒకరిద్దరు ఎంపీలు అధికారికంగా బీజేపీ కండువ కప్పుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రత్యర్ధి బలహీనతే బీజేపీ టార్గెట్…..!

తెలంగాణలో బీజేపీని దూకుడుగా నడిపించే వారికి , ఏపీలో ప్రత్యర్ధుల్ని ఇబ్బంది పెట్టగలిగే వారికి బీజేపీ తరపున ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి తగినంత ప్రాధాన్యత ఇచ్చినా పార్టీలో కావాల్సినంత జోష్‌ రాకపోవడంతో ప్రత్యామ్నయాల వైపు చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో బీజేపీని బలోపేతం చేయడానికి కీలకమైన సామాజిక వర్గాల వైపు బీజేపీ దృష్టి పెట్టింది. టీడీపీతో జట్టు కట్టేది లేదని బీజేపీ నాయకత్వం తేల్చి చెప్పేసిన నేపథ్యంలో సొంతంగా పార్టీని బలోపేతం చేయడానికి బలమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది.

ఉత్తరాంధ్రలో కనీసం పది నియోజక వర్గాల్లో ప్రభావం చూపగలిగిన బలమైన సామాజిక వర్గ నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితులు, రాజకీయంగా ఇబ్బంది కరమైన పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర నాయకులకు బీజేపీ మార్గంగా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో సైం మార్పులు తప్పవని చెబుతున్నారు. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుత నాయకత్వంలో కొందరు టిఆర్‌ఎస్‌ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటంపై ఆ పార్టీ కన్నెర్ర చేయబోతున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మార్పులు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner