Hyd Metro Record: హైదరాబాద్ మెట్రో రికార్డు - ఒకేరోజు 4 లక్షల మంది ప్రయాణం
Hyderabad Metro latest news: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును నమోదు చేసింది. శుక్రవారం రికార్డు స్థాయిలో మెట్రోల 4 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ వెల్లడించింది.
hyderabad metro record:హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. వినాయక నిమజ్జనం కావటంతో... శుక్రవారం(సెప్టెంబర్ 9) ఒక్కరోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైలు అధికారులు ప్రకటించారు. మియాపూర్- ఎల్‌బీనగర్ కారిడార్‌లో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గం కారిడార్‌లో 1.49 లక్షల మంది ప్రయాణించారు. అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ ఫుట్, ఫాల్ 62 వేల మంది, ఖైరతాబాద్ స్టేషన్‌లో 40 వేల మంది రైలు దిగారు. ఇదే స్టేషన్‌లో 22 వేల మంది రైలు ఎక్కినట్లు అధికారులు వివరించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్రయాణించారు.
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు పొడిగించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు రైళ్లను నడిపినట్లు అధికారులు తెలిపారు.
Hyderabad Metro Rush increase: కొద్దిరోజులుగా హైదరాబాద్ మెట్రోల్లో క్రమంగా రద్దీ పెరుగుతోంది. కరోనా కంటే ముందు సుమారుగా 4 లక్షల వరకు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేవాళ్లు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఆ సంఖ్య లక్ష నుంచి లక్షన్నరకే పరిమితమైంది. కరోనా తగ్గుముఖం పడటంతో.. మెట్రోల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఆ సంఖ్య కరోనా కంటే ముందులా.. 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశముందని మెట్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగినట్టుగా.. మెట్రో సర్వీసుల సంఖ్య పెంచేందుకు కార్యాచరణను రూపొందిచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు కూడా చాలా మంది ఉద్యోగులు మెట్రోను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. నగరంలోని ట్రాఫిక్కు వర్షాలు కూడా తోడవటంతో.. ప్రజలు మెట్రోవైపే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా మెట్రోకు మునుపటి ఆదరణ దక్కుతోంది. మరోవైపు.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం సూపర్ సేవర్ కార్డు కూడా.. ప్రవేశపెట్డడంతో సెలవు రోజుల్లో మరింత ఆదరణ కనిపిస్తోంది. రెండో శనివారాలు, సెలవుదినాల్లో ఈ సూపర్ సేవర్ కార్డుదారుల రద్దీ కూడా కొనసాగుతుండటంతో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన సౌకర్యాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.