తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hudhud Cyclone : హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు.. విలయం నుంచి విజయం దిశగా విశాఖ

HudHud Cyclone : హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు.. విలయం నుంచి విజయం దిశగా విశాఖ

08 October 2024, 12:48 IST

google News
    • Hud Hud Cyclone : విశాఖపట్నం.. ఓవైపు సముద్రతీరం.. మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటి సిటీపై హుద్ హుద్ తుపాను విరుచుకుపడింది. నగరమంతా కకావికలమైంది. ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే. విశాఖలో హుద్ హుద్ సృష్టించిన బీభత్సానికి పదేళ్లు నిండాయి.
హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు
హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు (@APSDMA)

హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు

ఎంతో ప్రశాంతమైన విశాఖపై హుద్‌ హుద్‌ తుపాను విరుచుకుపడి అప్పుడే పదేళ్లు అయ్యింది. 2014 అక్టోబరు 12న తీరం దాటిన హుద్ హుద్.. కుండపోత వర్షాలు కురిపించింది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. మునుపెన్నడూ చూడని విలయాన్ని సృష్టించాయి. అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. అప్పటి వరకూ నీడనందించిన భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. బయటి ప్రపంచంతో విశాఖకు సంబంధాలు లేకుండా చేసింది హుద్ హుద్.

విశాఖ ఎయిర్‌పోర్ట్ మొదలు.. బీచ్ రోడ్డు వరకూ అన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. విద్యుత్, టెలికాం, సమచార, రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. విశాఖ ప్రజలు మనోధైర్యం కోల్పోయారు. ఇక విశాఖ నగరం కోలుకోవడం కష్టమే అనే భావన ఏర్పడింది. అంతలా బీభత్సం సృష్టించింది హుద్ హుద్ తుపాను.

అలాంటి పరిస్థితిని నాటి సీఎం చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నారనే ప్రశంసలు ఉన్నాయి. తుపాను తీవ్రత పూర్తిగా తగ్గకముందే.. విశాఖ చేరుకున్నారు. మొదట బాధితుల్లో ధైర్యం నింపారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇతర జిల్లాల నుంచి నిత్యావసర సరకులు తెప్పించి పంపిణీ చేయించారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో మాట్లాడి సహాయక చర్యలను పరుగులు పెట్టించారు.

విశాఖ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాలే కనిపించాయి. కేంద్ర, రాష్ట్ర బృందాలతో వాటిని తొలగించి.. తక్కువ రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా విద్యుత్, రవాణా వ్యవస్థ తొందరగా మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత టెలికాం వ్యవస్థను పురరుద్ధరించి.. బయటి ప్రపంచంతో విశాఖకు బంధాన్ని తీసుకొచ్చారు. నెమ్మదిగా విశాఖ కోలుకుంది. మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది.

విలయం నుంచి విజయం దిశగా..

భయంకరమైన విలయాన్ని చూసిన విశాఖ.. ఇప్పుడు విజయం దిశగా అడుగులు వేస్తోంది. 2014లో బీభత్సాన్ని చూసిన విశాఖ.. తొమ్మిదేళ్లలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు వేదికైంది. ఇదే కాదు.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. విశాఖ కోలుకోవడం కష్టమే అన్న స్థాయి నుంచి డెస్టినేషన్ సిటీగా పేరు తెచ్చుకుంటోంది.

తదుపరి వ్యాసం