Visakha Honey Trap : విశాఖలో కిలేడీ హానీట్రాప్- మత్తు మందుతో ఆధీనంలోకి, ఆపై బ్లాక్ మెయిల్
Visakha Honey Trap : ధనవంతుల పిల్లలే లక్ష్యంగా హానీ ట్రాప్ నకు పాల్పడుతున్న ఓ కిలేడీని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని, వారికి దగ్గరై మత్తు పదార్థాలు అలవాటు చేస్తుంది. ఆ తర్వాత శారీరంగా కలిసినట్లు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంది.
విశాఖపట్నంలో కిలాడీ లేడీ ఘటన కలకలం సృష్టిస్తోంది. తొలుత సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని, ముగ్గులోకి దింపు ఆ తరువాత మత్తు మందు ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకుని, ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుందో మహిళ. అలాగే ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసి, కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుని తరువాత బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల ప్రకారం ఇద్దరు యువకులు హానీట్రాప్‌లో పడ్డారు.
వైజాగ్‌లోని షీలా నగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్‌జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. ఆ తరువాత అతని తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. మీ అబ్బాయి స్నేహితురాలినని, పెళ్లి చేసుకుంటానని అడగ్గా అతని తల్లిదండ్రులు నిరాకరించారు.
తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయ మాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచి యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూసులు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా, తన అనుచరులతో కలిసి తరచూ బెదిరించేది.
ఇటీవల భీమిలిలోని ఒక హోటల్‌లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని, యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుడి ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి, మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీసు కేసులు పెట్టించి, అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది. ఆమె ఇంటి నుంచి ఆ యువకుడు ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా అనుచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది.
ఆమె అనుచరులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధిత యువకుడు పోలీసులకు తెలిపారు.
ఎన్ఆర్ఐ యువకుడిలాగే, అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆమె వలపు వలలో చిక్కుకున్నాడు. అతడితో పరిచయం పెంచుకున్న జెమీమా పలుమార్లు నగదు తీసుకుంది. మయమాటలు చెప్పి వివాహం కూడా చేసుకుంది. ఆ తరువాత ఆమె జాడ లేకపోవడంతో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జెమీమా అతన్ని వేధింపులకు గురిచేస్తూ అందినకాడికి దోచుకుంది. నగదు ఇవ్వలేని పక్షంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను అతని భార్యకు చూపిస్తానని బెదిరించేంది. దీంతో ఆమె అడిగినంత నగదును ఇచ్చేవాడు. అయితే ఆమె ఆగడాలు, వేధింపులు తట్టుకోలేక బాధితుడు కంచరపాలెం పోలీసులకు ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హానీట్రాప్ కేసులో జెమీమా వెనుక ముఠా ఉంది- వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చి
హనీట్రాప్ కేసులో ఆధారాలు సేకరిస్తున్నామని వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితురాలు జాయ్ జెమీమా వెనుక ఒక ముఠా ఉందని, వారే ఆమెకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. ధనవంతులను ఎలా ట్రాప్ చేయాలి? మత్తు ఎలా ప్రయోగించాలి? వీడియోలు తీసి ఎలా బ్లాక్‌మెయిల్ చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారని తెలిపారు. జెమీమా బాధితులు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నట్లు గుర్తించామని, వారంతా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. హానీట్రాప్ కేసులో ఆధారాలన్నీ సేకరిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. యువకులను ముగ్గులోకి దింపి ఆపై డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న యువతిపై రెండు కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.
ప్రధానంగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని వల వేయటం జరుగుతోందని, ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారమే చేయిస్తోందని తెలిపారు. అరెస్టు అయిన నిందితురాలికి ఆ ముఠానే శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపిందన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా డిజిటల్ మార్కెటింగ్ పేరుతో పరిచయాలు ఏర్పరచుకుని, ఆ తరువాత బాధితులకు మత్తు మంది ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారని అన్నారు. అలాగే పలు ఫొటోలు, వీడియోలను చిత్రీకరించి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడతారని, ఆ తరువాత వారిని, వారి కుటుంబ సభ్యులను బెదిరించి అందినంత దోచకున్న తరువాత విడిచి పెడతారని అన్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం