Rs20 Travel Meals: ఆ రైల్వే స్టేషన్లలో రూ.20కే భోజనం.. అందుబాటులో ఎకానమీ మీల్స్
24 April 2024, 6:05 IST
- Rs20 Travel Meals: రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడకుండా ఊరటనిచ్చే వార్తను అధికారులు ప్రకటించారు. వేసవి రైలు ప్రయాణికులకు ఎకానమీ మీల్స్ అందుబాటులోకి తెచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఎకానమీ మీల్స్..
Rs20 Travel Meals: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో రూ.20కే భోజనం కొనుగోలు చేసే సదుపాయాన్ని ఐఆర్‌సిటిసి IRCTC ప్రారంభించింది. రైలు ప్రయాణాల్లో భోజనం చేయాలంటే జేబులు ఖాళీ కావడంతో పాటు నాణ్యత లేని నాసిరకం భోజనాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ప్రయాణికుల్ని నిలువు దోపిడీకి గురి చేస్తుండటంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కొద్ది రోజులుగా తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారాన్ని విక్రయించే విషయంలో ఐఆర్‌సిటిసి ప్రయోగాలు చేస్తోంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌లోని విజయవాడ & రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో భోజనం తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని Economy Meals అందిస్తుందని చెప్పారు. ఈ భోజనాలు ప్లాట్‌ఫారమ్‌లపై జనరల్ కోచ్‌ల దగ్గర అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు ప్రకటించారు.
రైలు ప్రయాణీకులకు నాణ్యమైన, సరసమైన మరియు పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి, భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి "ఎకానమీ మీల్స్" ప్రవేశపెట్టాయి.
వేసవిలో ప్రయాణీకుల రద్దీని అంచనా వేస్తూ, రైలు ప్రయాణీకు Passengersల్లో ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరలో రెండు రకాల భోజనాలు అందిస్తున్నారు. ఈ రకం భోజన కౌంటర్లు భారతీయ రైల్వేలలో 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్ల ద్వారా అందిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే South central Railway పరిధిలో ఎకానమీ మీల్స్ సదుపాయాన్ని 12 స్టేషన్లలో అందిస్తున్నారు. ప్రయాణీకులకు ఈ భోజనాన్ని అందించడానికి 23 కౌంటర్లు ఏర్పాటు చేవారు.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లలో ఎకానమీ మీల్స్ అందుబాటులో ఉంటాయి.
విజయవాడ డివిజన్‌లో, విజయవాడ, రాజమండ్రి స్టేషన్‌లలో రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లతో పాటు జన్ ఆహార్ యూనిట్లలో కూడా రూ.20కే భోజనం విక్రయిస్తున్నారు.
ఎకానమీ మీల్స్:
ప్రయాణికులపై ఏ మాత్రం భారం పడకుండా రూ. 20లకే ఈ భోజనాలను విక్రయిస్తారు. ప్రయాణీకులకు సంతృప్తికరమైన భోజనం తక్కువ ధరకే లభిస్తుందని చెబుతున్నారు.
స్నాక్ మీల్స్…
తేలికపాటి భోజనం కోరుకునే వారికి రూ. 50/- స్నాక్ మీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, ఎకానమీ మీల్స్ కొనుగోలు చేయడానికి వీలుగా ప్లాట్‌ఫారమ్‌లలో సాధారణ సెకండ్ క్లాస్ (General Coach) కోచ్‌ల దగ్గర ఉండే కౌంటర్లలో ఈ భోజనం, తాగు నీరు అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రయాణికులు నేరుగా ఈ కౌంటర్ల నుండి వారికి కావాల్సిన భోజనం కొనుగోలు చేయొచ్చు. గత ఏడాది దేశ వ్యాప్తంగా దాదాపు 51 స్టేషన్లలో విజయవంతంగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారతీయ రైల్వేలు ఈ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించినట్టు విజయవాడ డిఆర్ఎం తెలిపారు.
దేశంలో 100 స్టేషన్లలో దాదాపు 150 సేల్స్ కౌంటర్లు పని చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మరిన్ని స్టేషన్‌లకు ఈ సేవల్ని విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో సౌలభ్యంతో పాటు ప్రజలకు ఆర్ధిక భారం లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ఎకానమీ మీల్స్ లక్ష్యమని డిఆర్‌ఎం నరేంద్ర పాటిల్ చెప్పారు.
ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఆహారాలు ఇవే…
ఎకానమీ మీల్ ప్యాక్‌లో 175 గ్రాముల బరువైన ఏడు పూరీలు, ఆలూ వెజ్ ఫ్రై, చిన్న పచ్చడి ప్యాకెట్ రూ.20కే అందిస్తారు.
ఎకానమీ మీల్స్‌లో 200గ్రాముల లెమన్ రైస్ విత్ పికెల్, కర్డ్ రైస్ విత్ పికెల్, పులిహారను కూడా రూ.20కే విక్రయిస్తారు.
స్నాక్ కంబో మీల్స్‌లో ప్రాంతాల వారీగా అందుబాటులో ఉండే ఆహారాన్ని రూ.50కు విక్రయిస్తారు.