Tuesday Motivation : జీవితమనే రైలుకు చాలా స్టేషన్‌లు ఉంటాయి.. బ్రేకప్ అయిందని తెగ బాధపడిపోకు
09 April 2024, 5:00 IST
- Tuesday Motivation On Relationship : ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్పే మాట మాకు బ్రేకప్ అయిందని. అయితే అయింది.. బ్రేకప్ అయితే జీవితం ఆగిపోవాలనేం లేదు కదా.
మంగళవారం మోటివేషన్
జరిగేదంతా మంచికే. మన జీవితంలో జరిగే అన్ని సంఘటనలు సంతోషకరమైనవి, జీవిత పాఠాలుగానే చూడాలి. కొన్ని చేదు సంఘటనలు మనం చేసిన తప్పేమిటో తెలుసుకుని ఇంకోసారి అదే తప్పు చేయకుండా ఉండాలి. విడిపోవడమంటే తప్పు చేశారని అర్థం కాదు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఆలోచనల్లో తేడా. ఏదైనా సంబంధంలో మొదట ప్రతిదీ బాగానే ఉంటుంది. కానీ సమయం గడిచే కొద్దీ సర్దుబాటు కష్టం అవుతుంది.
మొదట మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి సమయం గడిచేకొద్దీ మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు. లేదా మొదట్లో ఉన్నంత చిక్కగా బంధం శాశ్వతంగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తే చివరకు మన జీవితంలోకి రావచ్చు. ఏదైనా సంబంధంలో సమస్యలు సాధారణం. ఏదైనా బంధంలో తరచూ సమస్యలు వస్తే.. దూరమైపోవడమే మంచిది.
ఇతరులు ఏమనుకుంటారోననే ఆలోచన ఉండకూడదు. మన గురించి మనం తెలుసుకునే ప్రక్రియ అంతే. బ్రేక్ అప్ తర్వాత నేను వారి గురించి తెలుసుకున్నాను అనే పాత చింతకాయ మాటలు ఆపేయండి. ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత వారి గురించిన ఆలోచనే వద్దు. విడిపోవడం మనల్ని మనం తెలుసుకోవడంలో సహాయపడుతుంది. చేసిన తప్పులను సరిదిద్దుకోవడం మన వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
విడిపోవడం అనేది మన జీవితంలో మనం ఎదుర్కొనే ఇతర వైఫల్యాల వంటిది. ఇది ప్రస్తుతానికి బాధకరంగా ఉండవచ్చు. కానీ అలాంటి పరిస్థితి మళ్లీ జరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అలా జరిగితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీకు ఉపయోగపడుతుంది.
మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక కారణంతో జరుగుతుంది. ఆ పరిస్థితిలో మన దృష్టికి రాకపోయినా జీవితంలో ఏదో ఒకరోజు ఆ రోజు విడిపోయి మంచి పను చేశాలే అని మీరే అనుకుంటారు. జీవితమనే రైలులో చాలా స్టేషన్‌లు వస్తాయి. బ్రేకప్ అయిందని తెగ బాధపడిపోకూడదు మంచి ప్లాట్ ఫామ్ చూసి సెటిల్ అయిపోవాలంతే.
ఎక్కువసేపు ఒకే విషయం గురించి ఆలోచించడం లేదా చింతించడం మూర్ఖత్వం. మీ ప్రతి క్షణం మీ ఆలోచనలు మీ భవిష్యత్తుకు పెట్టుబడి. సరిగ్గా పెట్టుబడి పెట్టకపోతే నష్టాల బాట తప్పదు. తాము చేసేదంతా సరైనదేనని భావించడం రిలేషన్ షిప్ లో సహజం. మనల్ని చికాకు పెట్టడానికి వాళ్ళు వాడిన మాటలను మనం పట్టించుకోకుండా ఉండాలి.
ప్రేమలో ఉన్నప్పుడు మనకు ఏమీ తెలియదు. మన గురించి పట్టించుకునే ఇతరుల మాటలను విస్మరిస్తాం. అయితే ఆ సంబంధం నుంచి బయటపడినప్పుడే మనం ఎవరో మనకు తెలుస్తుంది. బయట ఇంకో ప్రపంచం కూడా ఉందని అర్థమవుతుంది.
మీ మాజీ భాగస్వామి తప్పు చేసినా క్షమించడం నేర్చుకోండి. సంబంధం నుండి బయటపడిన తర్వాత కూడా అదే పగను కలిగి ఉండకండి. అదేవిధంగా మీరు సంబంధంలో విడిపోతే మీ పాత భాగస్వామికి వద్దకు తిరిగి వెళ్లవద్దు. మళ్ళీ అదే తప్పు చేయవద్దు, దాని నుండి నేర్చుకోండి. తప్పును మళ్లీ మళ్లీ చేస్తే.. అదే అలవాటు అవుతుంది. జీవితం నరకంగా మారుతుంది.