AP Rains: బలపడుతున్న తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు అలర్ట్.. వాతావరణ అంచనాలు ఇవే
20 December 2024, 16:57 IST
- AP Rains: ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. మొన్నటివరకు తుపాను ఏపీని వణికించింది. తాజాగా.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది గంట గంటకూ బలపడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉంది.
ఏపీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో.. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణ
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశము ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణ కోస్తాంధ్రలో ఇలా
ఇక దక్షిణ కోస్తాంధ్రలో.. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముంది.
అటు రాయలసీమ విషయానికొస్తే.. శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారులు అంచనా వేశారు. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో వాతావరణం
ఇటు తెలంగాణలో డిసెంబర్ 24వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. డిసెంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.