Tirupati Laddu Controversy : మరీ ఇంత దుర్మార్గమా.. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వాడుకుంటారా? : వైఎస్ జగన్
20 September 2024, 16:09 IST
- Tirumala Laddu : తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే.. కల్తీ నెయ్యి అంటూ డ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
కల్తీ నెయ్యి వ్యవహారం ఓ కట్టు కథ అని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెయ్యి సప్లై చేసిన ప్రతీ ట్యాంకర్.. నెయ్యితో పాటు.. ఎన్ఏబీఎల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారని.. ఆ తర్వాత టీటీడీలో 3 శాంపిల్స్ తీసుకొని.. మూడు టెస్టులు చేస్తారని జగన్ వివరించారు. ఆ తర్వాతనే ఆ నెయ్యిని ప్రసాదంలో వాడతారని చెప్పారు. ఈ ప్రాసెస్ జరగపోతే.. అసలు ఆ ట్యాంకర్ ముందుకెళ్లదని.. రిజెక్ట్ అయిన నెయ్యిని అసలు వాడరని స్పష్టం చేశారు. వాడని నెయ్యిని అడ్డంగా పెట్టుకొని.. ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని జగన్ ప్రశ్నించారు.
'జులై 12న నెయ్యి శాంపిల్స్ తీసుకొని.. 17న టెస్టింగ్ కోసం పంపారు. జులై 23న రిపోర్ట్ వచ్చింది. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ఏం చేశారు. రెండు నెలల తర్వాత దీని గురించి మాట్లాడటం ఏంటీ. ఆ నెయ్యి వాడారని, దాన్ని భక్తులు తిన్నారని ఎలా మాట్లాడతారు. సీఎం స్థాయి వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. రాజకీయాల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా' అని జగన్ ప్రశ్నించారు.
'చంద్రబాబు 100 రోజుల పరిపాలన మీద ఇవాళ ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఈ 100 వంద రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెనూ లేదు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి.. చంద్రబాబు ఇవాళ దోషిగా నిలబడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, క్యాంపెయిన్ చేసిన విధానం గమనిస్తే.. అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు' అని జగన్ విమర్శించారు.
'చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనంలోకి వెళ్లాయి. వ్యవసాయం, విద్య, వైద్యం.. ఇలా అన్నింటినీ గాలికి వదిలేశారు. రైతులకు కనీసం సాయం చేయలేదు. రూ.20 వేలు ఇస్తానని ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. పంటల బీమా ఇవ్వలేదు. ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ సలహా మండళ్లు రద్దయ్యాయి' అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'గతంలో ప్రతీ పథకం డోర్ డెలివరీ జరిగేదు. ఇప్పుడు డోర్ డెలివరీ ఎగిరిపోయింది. ఇప్పుడు అస్సలు పారదర్శకత లేదు. గ్రామాల్లో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. పథకాల కోసం వాళ్ల ఇళ్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ పాలనలో ఈరోజు న్యాయాన్ని పాతరేశారు. దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు' అని జగన్ ఆరోపించారు.
'ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేస్తే.. దాన్నుంచి డైవర్ట్ చేయడానికి.. మదనపల్లికి హెలికాప్టర్ పంపి హంగామా చేశారు. విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ తెరపైకి వచ్చినప్పుడు.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 30 ఏళ్లు అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. కొత్తగా ముంబై నుంచి ఓ మహిళను తీసుకొచ్చి మళ్లీ డ్రామా స్టార్ట్ చేశారు' జగన్ ఆరోపించారు.
'విజయవాడ, ఏలేరు వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజీకి బోట్లు వచ్చాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి ఆందోళనలు జరుగుతుంటే.. ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసి డైవర్ట్ చేశారు. ఇక 100 రోజుల పాలనపై ప్రజలు కోపం ప్రదర్శిస్తున్న సమయంలో.. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాజకీయాల కోసం చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు' అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.