Madanapalle Incident : మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్న డీజీపీ- డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ కౌంటర్
22 July 2024, 21:43 IST
- Madanapalle Incident : మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ గా భావిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆర్డీవో ఆఫీసులో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. జగన్ దిల్లీ ధర్నాను డైవర్ట్ చేసేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ విమర్శించింది
మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్న డీజీపీ- డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ కౌంటర్
Madanapalle Incident : మదనపల్లె ఘటన ప్రమాదం కాదని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన డీజీపీ... ఆదివారం రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోందని, ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదన్నారు. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశమే లేదన్నారు. ఈ ఘటనపై ఇంకా సమగ్ర విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే అధికారులు కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆర్డీవో ఆఫీస్‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా ఉన్నారన్నారు. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నామన్నారు. దర్యాప్తు కోసం 10 బృందాలను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. వోల్టేజ్ తేడాలు లేవని, షార్ట్ సర్క్యూట్‌కు అవకాశమే లేదన్నారు. ఆర్డీవో ఆఫీస్‌లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్నారు. ఘటనలో రెవెన్యూ, పోలీస్ అధికారుల అలసత్వం కనిపిస్తోందన్నారు. ప్రమాదంపై సీఐ... ఎస్పీ, కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదన్నారు. త్వరలో అన్ని వివరాలు బయటికొస్తాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ - వైసీపీ
చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు తగలబడ్డాయన్న ఆరోపణలు, దానిపై సీఎం చంద్రబాబు చేస్తున్న హడావిడి డైవర్షన్ పాలిటిక్స్‌కు నిదర్శనమని వైసీపీ విమర్శించింది. చంద్రబాబుకు ఈ విషయంలో ఘనుడనే విషయం దేశం మొత్తానికి తెలిసిందే అని సెటైర్లు వేసింది. రాష్ట్రంలో గాడితప్పిన పాలన, రాజకీయ హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఉన్న రికార్డులు, వాటి వివరాలు కిందనున్న ఎమ్మార్వో కార్యాలయంలోనూ, పైనున్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ, రాష్ట్రస్థాయిలో ఉన్న సీసీఎల్‌ఏ కార్యాలయంలో కూడా ఉంటాయని వైసీపీ తెలిపింది. పైగా ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటాయని, రికార్డుల దగ్ధం ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారనుకుంటే విచారించి, నిర్ధారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.
దిల్లీ ధర్నాను డైవర్ట్ చేసేందుకే
డీజీపీని, సీఐడీ చీఫ్‌లను ఆగమేఘాలమీద హెలికాప్టర్ లో మదనపల్లె పంపి, వైసీపీ నాయకుల ప్రమేయం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. తప్పుడు వివరాలను అనుకూల మీడియాకు పంపి నానా హడావిడి చేస్తున్నారంటే ఈ ప్రయత్నాలన్నీ దిల్లీలో చంద్రబాబు పాలనపై వైసీపీ చేపట్టబోయే నిరసన, ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్‌ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అని ఆరోపించారు. కర్నూలు జిల్లా మచ్చుమర్రిలో బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు, వినుకొండలో రషీద్ దారుణహత్యకు గురైనప్పుడు, రాష్ట్రంలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగినప్పుడు దోషులను వెంటనే పట్టుకుని, చట్టం ముందు నిలబెట్టడానికి ఇదే డీజీపీని హెలికాప్టర్ లో ఇలాగే పంపి ఉంటే బాగుండేదని వైసీపీ ట్వీట్ చేసింది.