Madanapalle Incident :పెద్దిరెడ్డి సతీమణి పేరుపై ల్యాండ్ కన్వర్షన్ కు అప్లై,మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
Madanapalle Incident : మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష చేశారు. దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. ఈ ఘటనపై మంత్రి సత్యప్రసాద్ స్పందిస్తూ...దగ్ధమైన కీలక ఫైళ్లలో 90 శాతం కంప్యూటర్ లోనే ఉన్నాయన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు.
Madanapalle Incident : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంపై ప్రాథమిక సమాచారం అందిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ...వారం కిందట మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుపై ల్యాండ్ కన్వర్షన్ కు దరఖాస్తు చేశారన్నారు. 986 ఎకరాల అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి బినామీలకు ఇచ్చారని, వీటిని త్వరలో రద్దు చేయబోతున్నామన్నారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన కీలక ఫైళ్లలో 90 శాతం కంప్యూటర్ లోనే ఉన్నాయన్నారు. దగ్ధమైన ఫైళ్లను రిట్రీవ్ చేస్తామన్నారు. ఏఏ ఫైళ్లు దగ్ధమయ్యాయనే అంశంపై ఆరా తీస్తున్నామన్నారు. లా విభాగంలోనూ కొన్ని ఫైళ్లు పోయాయంటున్నారని మంత్రి తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగి గౌతమ్, మరో ఉద్యోగి ఎందుకు ఉన్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. పెద్దిరెడ్డి సతీమణి పేరిట ల్యాండ్ కన్వర్షన్ కు దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లను మంత్రి సత్యప్రసాద్ మీడియాకు చూపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసిందేనని అనిపిస్తోందన్నారు. ఈ ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణం కాదు
మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది నుంచి డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రాథమిక నివేదిక కోరారు. సంఘటనాస్థలిని డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యర్ పరిశీలించారు. సీఐడీ చీఫ్ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసులు అంటున్నారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్ ఆరా తీస్తున్నారు.
మదనపల్లె ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాద ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై ఓ సారి రివ్యూ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.దగ్ధమైన ఫైళ్లు ఏయే విభాగాలకు చెందినవో కనుక్కోవాలని ఆదేశించారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైనా దృష్టి పెట్టాలన్నారు.
సంబంధిత కథనం