తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ips Transfers: ప్రకాశం ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి.. అదే అసలు కారణమా?

IPS Transfers: ప్రకాశం ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి.. అదే అసలు కారణమా?

Sarath chandra.B HT Telugu

02 February 2024, 8:39 IST

google News
    • IPS Transfers:  తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తూ సిఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో  కొద్ది రోజులుగా అధికారుల బదిలీలు జరుగుతున్నా,  పరమేశ్వర్ రెడ్డి బదిలీ చర్చనీయాంశమైంది. 
తిరుపతి ఎస్పీ బదిలీ
తిరుపతి ఎస్పీ బదిలీ

తిరుపతి ఎస్పీ బదిలీ

IPS Transfers: ఏపీలో జరుగుతున్న ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆలిండియా సర్వీస్ అధికారులు మొదలుకుని ఎన్నికల విధులతో సంబంధం ఉండే ప్రతి ఒక్కరిని బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్‌ ఇప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అధికార పార్టీకి సహకరించారనే ఆరోపణలు ఐపీఎస్‌ అధికారిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో స్థానిక నేతకు కొరకరాని కొయ్యగా తయారైన ఎస్పీని ప్రకాశం జిల్లాకు బదిలీ చేయడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు తయారైంది.

తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్రెడ్డిని ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్‌ తిరుపతి ఎస్పీగా పంపారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

ముఖ్యమంత్రి జగన్ భద్రతా విభాగంలో పనిచేసిన పరమేశ్వర్‌ రెడ్డి 2022 ఏప్రిల్లో తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి సన్నిహితుడిగా ముద్ర వేసుకున్నారు.

మరోవైపు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గానికి ప్రాంతీయ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రెండు రోజుల క్రితం నియమించారు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి చెవిరెడ్డి టిక్కెట్ కూడా ఖరారైంది. ఈ క్రమంలో ఈసీ ఆగ్రహం ఎదుర్కొన్న పరమేశ్వర్‌ రెడ్డిని ఒంగోలు ఎస్పీగా నియమించినట్టు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో తిరుపతిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి నిరక్షరాస్యుల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయడం వెలుగు చూసింది.

జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర్‌ రెడ్డి ఈ ఫిర్యాదులపై స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు చంద్రగిరిలో ప్రతి పక్షాల ఓట్ల తొలగించాలని పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో నకిలీ ఫాం-7 దరఖా స్తులపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 10 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక్క అరెస్ట్‌ కూడా జరగలేదు.

శ్రీకాళహస్తిలో వివాదాస్పద సీఐగా పని చేసిన అంజూయాదవ్ వ్యవహారంలో సైతం పరమేశ్వర్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రంలో గంజాయి వినియోగం, సాగు విస్తృతంగా ఉన్నాయని నారా లోకేశ్ ఆరోపిస్తే .. ఆయనకు కౌంటర్ ఇస్తూ ఎస్పీ మాట్లాడారు.

ఇక ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికాతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి విభేదాలు ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో దర్యాప్తు విషయంలో బాలినేనిని ఇరకాటంలో పెట్టేందుకు ఎస్పీ ప్రయత్నించారని ఆయన భావించారు. దీంతో ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. కేసులో సంబంధం ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేయాలని హడావుడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఎస్పీ నేరుగా సిఎంఓకు దర్యాప్తు వివరాలు అందించడంతో బాలినేని ఇగో హర్ట్‌ అయ్యింది. ఈ క్రమంలో ఆమెను తిరుపతికి బదిలీ చేశారు. ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలు వచ్చేలా మంత్రాంగం నడిపారనే ఆరోపణలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం