Chittoor Crime : మగబిడ్డ కోసం అత్తమామల వేధింపులు, ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య
30 June 2024, 16:22 IST
Chittoor Crime : భార్య, అత్తమామల వేధింపులు తట్టుకోలేక వివాహిత, ఇద్దరు బిడ్డలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
మగబిడ్డ కోసం అత్తమామల వేధింపులు, ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య
Chittoor Crime : అత్తింటి వేధింపులు తాలలేక ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం విషాదంలో కూరుకుపోయింది. అత్తమామల మగ బిడ్డ, కట్న కానుకల డిమాండ్‌తో మూడు నిండు ప్రాణాలు అనంతలోకానికి చేరాయి. అత్తమామల వేధింపులకు కట్టుకున్నవాడు అడ్డుకట్ట వేయలేదు. దీంతో వేధింపులు నిత్య కృత్యమయ్యాయి. భర్త మద్దతు లేక, మరోవైపు వేధింపులు తాలలేక మరణమే శరణ్యమని ఆ మహిళ భావించింది. దీంతో తన ఇద్దరు పిల్లలతో సహా మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనలో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లె గ్రామంలో రాణి అనే మహిళకు ఐదేళ్ల క్రితం అదే మండలానికి చెందిన రాయలపేటకు చెందిన రాయలపేటకు చెందిన దిలీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మొదట కొద్ది రోజులు వారి సంసారం బాగున్నప్పటికీ, ఆ తరువాత నిరంతరం గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భార్య ఆవేదనతోనే ఉండేది. ఈ క్రమంలోనే రాణి, దిలీప్‌కు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయితే అత్తింటివారు మగబిడ్డ కావాలని వేధించేవారు. అయితే ఇటీవలి కాలంలో అత్తమామల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రాణి ఏం చేసిన వ్యతిరేక దృష్టితో ఆలోచించి తిట్టేవారు. వాటినీ రాణి భరించేది. చాలా సార్లు చెప్పి చూసింది. అత్తమామల్లో మార్పు వస్తుందని ఆశతో ఇన్నాళ్లు వేచిచూసింది. కానీ అత్తమామల్లో ఎటువంటి మార్పు రాలేదు.
అత్తమామల వేధిస్తుంటే, కట్టుకున్న భర్త ఎటువంటి మద్దతు ఇవ్వలేదు. దీంతో కుంగిపోయిన రాణి తన ఇద్దరు పిల్లలు హిమశ్రీ, జోష్మితలతో కలిసి ఆదివారం ఉదయం పట్రపల్లెలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. రాణి తండ్రి వెంకటరమణ అత్తమామల పోరు, డబ్బలు డిమాండ్ భరించలేకనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను నిత్యం వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. తన సమస్యలను కన్నవాళ్లకు చెప్పుకోలేక, దిగిమింగలేకనే ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు వచ్చిన బాధ మరెవ్వరికీ రాకూడదని అన్నారు. ఈ ఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాణి అత్తమామలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు