Sangareddy District : కూతురిపై లైంగిక వేధింపులు..! భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య-a wife killed her husband to death for sexually assaulting her daughter in sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy District : కూతురిపై లైంగిక వేధింపులు..! భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

Sangareddy District : కూతురిపై లైంగిక వేధింపులు..! భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

HT Telugu Desk HT Telugu

Wife killed Husband in Sangareddy district : కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేసిన భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

భర్తను నరికి చంపిన భార్య (representative image) (image source unsplas.com)

Wife killed Husband in Sangareddy district: మద్యం మత్తులో కన్న తండ్రే… కూతురిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని చూసి ఆగ్రహించిన తల్లి భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన మన్నె మణయ్య (55),ఇందిరా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. కాగా ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు చేశారు. దీంతో పెద్ద కూతురుకు ఒక పాప జన్మించింది. ఆ తర్వాత భర్త చనిపోవడంతో కొంతకాలం నుండి తల్లిగారింట్లోనే ఉంటుంది. దీంతో ఆమె ప్రతిరోజూ సంగారెడ్డికి వెళ్లి అడ్డ కూలీగా పనిచేస్తుంది. కాగా కుమారుడు ప్రవీణ్ కుమార్ కు వివాహం చేయగా అతడు భార్యతో గొడవల కారణంగా గతంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గొడ్డలితో మెడపై నరకడంతో ......

ఈ క్రమంలో మాణయ్య కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్య, కూతురును దుర్భాషలాడేవాడు. దీంతో మద్యానికి బానిసైన మాణయ్య కూతురిని కొన్ని రోజుల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు. 

ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కూతురు గది తలుపులను గొడ్డలితో పగలగొట్టి ఆమెను చంపేస్తానని బెదిరించి దాడికి ప్రయత్నించాడు. దీంతో భార్య, మనవరాలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అతని వద్ద ఉన్న గొడ్డలి, గడ్డపారను లాక్కున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య ఇందిర… కూతురును రక్షించడానికి అదే గొడ్డలితో భర్త మాణయ్యను మెడపై నరికింది. తీవ్రంగా గాయపడిన మాణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. 

గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తల్లి, కూతుర్లను అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అసభ్య ప్రవర్తన… మూడేళ్ల జైలు శిక్ష

ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఓ నిందితుడికి సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి జయంతి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన బేగరి మురళి (24) 2017 లో అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేసాడు. దీంతో ఆ బాలిక తల్లితండ్రులు సంగారెడ్డి రురల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

అప్పటి ఎస్ఐ శివలింగం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో పీపీ. కృష్ణ వాదనలను విన్న న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా కట్టని పక్షంలో మరో రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అమలు చేయాలని తీర్పు నిచ్చారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.