Chittoor Crime : చిత్తూరు జిల్లాలో విషాదం, నవ వరుడి ప్రాణం తీసిన విద్యుత్ తీగలు!
Chittoor Crime : చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో నవ వరుడు మృతి చెందాడు. అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి ఈ దారుణ జరిగింది.
Chittoor Crime : చిత్తూరు జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం దేవలకుప్పం అటవీ ప్రాంతంలో గొర్రెలను మేతకు తోలుకెళ్లారు ముగ్గురు యువకులు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొన్ని గొర్రెలు కనిపించకపోవడంతో యువకులు అటవీ ప్రాంతంలోకి వెతికేందుకు వెళ్లారు. గొర్రెలను వెతికే క్రమంలో అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి గంగాధర్(20) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన గంగాధర్ కు ఇటీవలె వివాహం జరిగింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ తీగలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
విద్యుత్ షాక్ తో రైతు మృతి
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు. గడ్డి కోత మిషన్ తో పొలం గట్లపై గడ్డిని కోస్తుండగా ప్రమాదవశాత్తు రైతుకు విద్యుత్ షాక్ తగిలింది. పోచారం గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య (47) అనే రైతు మంగళవారం పొలంలోని గట్లపై ఉన్న పచ్చిగడ్డిని గడ్డి కోసే మిషన్ తో కోస్తుండగా పొలంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ మిషన్ కు విద్యుత్ సరఫరా అయ్యి మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే కలుపుతీస్తున్న మల్లయ్య కుటుంబ సభ్యులు అతడిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మల్లయ్యను పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మల్లయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం
ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లో ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు యువకులు కరెంట్ షాక్ కు గురయ్యారు. జెండా దిమ్మపై ఐరన్ పోల్ పెడుతుండగా... అది విద్యుత్ తీగలను తగిలి ల్యాడ విజయ్, అంజిత్, చక్రిలు కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్, అంజిత్ లు చికిత్స పొందుతూ మరణించారు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. విద్యుత్ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గ్రామాల్లో, పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల గురించి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.