తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Tragedy : ఎంత విషాదం.. నలుగురిని కాపాడి వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. భార్య 8 నెలల గర్భవతి

Vijayawada Tragedy : ఎంత విషాదం.. నలుగురిని కాపాడి వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. భార్య 8 నెలల గర్భవతి

Published Sep 05, 2024 04:24 PM IST

google News
    • Vijayawada Tragedy : బెజవాడ నగరంలో బీభత్సం సృష్టించిన వరదలు.. ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాజాగా ఓ విషాద ఘటన విజయవాడ వాసుల్ని కంట తడి పెట్టిస్తోంది.
వరదల్లో గల్లంతైన చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో) (X)

వరదల్లో గల్లంతైన చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో)

విజయవాడ నగరంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు.. అంతులేని విషాదాన్ని నింపాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. తాజాగా నగర వాసులు కంట తడి పెట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. వరదలు వస్తుండగా.. నలుగురిని కాపాడిన వ్యక్తి.. అదే వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది.


నలుగురిని కాపాడి..

విజయవాడకు చెందిన చంద్రశేఖర్ (32) సింగ్ నగర్‌లోని డెయిరీ ఫాంలో పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో.. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించారు. సమీపంలో తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. ఇక తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. కాలు జారి పడిపోయాడు. వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతి అని అతని బంధువులు చెబుతున్నారు.

విషాదంలో కుటుంబం..

చంద్రశేఖర్ మృతితో అతని కుటంబం విషాదంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరు వారు రోధిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. తమను కాపాడిన చంద్రశేఖర్ గల్లంతు కావండంతో.. అతని సోదరులు, ఇద్దరు వ్యక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్ చాలా మంచి వ్యక్తి అని కొనియాడుతున్నారు. తమ కళ్ల ముందే చంద్రశేఖర్ వరదల్లో కొట్టుకుపోయాడని రోధిస్తున్నారు.

సీఎం పర్యటన..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటలు వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరమ్మతులు..

ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతు పనులు చేస్తున్నారు. బ్యారేజ్‌ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్‌ వెయిట్‌ దెబ్బతిన్నది. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు చేస్తున్నారు. మరమ్మతు పనులు చీఫ్‌ ఇంజినీర్‌ తోట రత్నకుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. ఆయన సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, డ్యామ్‌ సేఫ్టీ చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.