ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు పనులు చేపడుతున్నారు. బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతింది. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ మరమ్మతు పనులు చీఫ్ ఇంజినీర్ తోట రత్నకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు.
నాగినేని కన్నయ్య నాయుడు రిటైర్డ్ ఇంజినీర్, సాంకేతిక సలహాదారులు. ఆయన దేశంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో గేట్లు ఏర్పాటు చేయడం, మరమ్మతు చేయడంలో ఫేమస్. ఆగస్టులో తుంగభద్ర జలాశయంలో వరదలకు కొట్టుకుపోయిన క్రస్టుగేటు స్థానంలో.. కేవలం వారం రోజుల్లోనే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. 2024 ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బుడమేరుకు మళ్లీ వరద వస్తోంది. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో.. బుధవారం రాత్రి 7 సెం.మీ వర్షం కురిసింది. దీంతో గురువారం మధ్యాహ్నానికి 10 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బుడమేరు ఔట్‌ఫ్లో 5,689 క్యూసెక్కులు ఉందని అధికారులు వివరిస్తున్నారు. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహం పెరిగింది. జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు నీరు వచ్చింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కొల్లేరు వాసులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.