APSRTC Kashi Ayodhya Tour : కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు
02 July 2024, 17:16 IST
- APSRTC Kashi Ayodhya Tour : ఏపీ, తెలంగాణలోని పుణ్య క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య క్షేత్రాలు దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 8 రోజుల్లో 14 పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు.
కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు
APSRTC Kashi Ayodhya Tour : హిందూపురం నుంచి కాశీ, అయోధ్య యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్రంలో ఎనిమిది రోజుల పాటు 14 పుణ్యక్షేత్రాలను దర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీసులను కొత్తగా వేసింది. రాష్ట్రంలోని హిందూపురం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యకి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లను తీసుకొచ్చింది.
పుణ్యక్షేత్రాల సందర్శన
ఈనెల 12న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హిందూపురం నుంచి బస్ బయలుదేరుతుంది. మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. 14 పుణ్య క్షేత్రాలను సందర్శన ఉంటుంది. హిందూపురంలో బయలుదేరిన బస్సు హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడ శంషాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి నిర్మించిన రామానుజచార్యుల దేవాలయం, యాదిగిరి గుట్ట నరసింహస్వామి దేవస్థానం సందర్శిస్తారు. ఆ తరువాత నిజామాబాద్ సరస్వతీ దేవి ఆలయం (బాసర) సందర్శన ఉంటుంది.
అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని ప్రయాగ్ రాజ్‌గంగ, యమున, సరస్వతీ పుణ్యనదుల్లో స్నానం ఉంటుంది. అక్కడ నుంచి అయోధ్య వెళ్తారు. అక్కడ శ్రీరామ దర్శనం, సీతాదేవి ఇల్లు, జనక మహారాజ్ కోట సందర్శిస్తారు. ఆ తరువాత కాశీ (వారణాసి) చేరుకుని శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం గంగానది పుణ్యతీర్థ స్నానం, భైరవ దర్శనం ఉంటుంది.
కాశీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ రామకృష్ణ బీచ్, కైలాసగిరి చూస్తారు. అనంతరం సింహాచలంలో శ్రీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దర్శనం ఉంటుంది. ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం, అన్నమయ్య క్షేత్రం సందర్శన ఉంటుంది. అక్కడ నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
ఆ తరువాత అమరావతి వెళ్లి అమరేశ్వరుని దర్శనం చేస్తారు. కోటప్పకొండ అమరేశ్వరుని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్నస్వామి భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేస్తారు. ఆ తరువాత యాగంటి వెళ్లి యాగంటి బసవన్న దర్శనం చేసుకుంటారు.
ఏపీఎస్ ఆర్టీసీ అందించే ఈ ప్యాకేజీలో ఒక్కొక్క టిక్కెట్టు ధర రూ.8,500 ఉంటుంది. ఆసక్తి గల వారు టిక్కెట్టు కావాలనుకుంటే ఈ ఫోన్ నంబర్లు 9440834715 (ఎవీవీ ప్రసాద్), 7382863007, 7382861308లను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రయాణికులను సంప్రదించి భోజన వసతి ఏర్పాటు చేస్తారు. అయితే భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. అలాగే అవసరం నిమిత్తం ఏదైనా ప్రాంతంలో రూమ్ తీసుకుంటే దాని ఛార్జీలు కూడా ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు