Shivalingam: కాశీలోని ఈ అద్భుతమైన శివలింగం తాకితే మరణ భయమే ఉండదు-touch the shivalingam to overcome death fear in kashi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shivalingam: కాశీలోని ఈ అద్భుతమైన శివలింగం తాకితే మరణ భయమే ఉండదు

Shivalingam: కాశీలోని ఈ అద్భుతమైన శివలింగం తాకితే మరణ భయమే ఉండదు

Gunti Soundarya HT Telugu
Jun 06, 2024 05:46 PM IST

Shivalingam: మరణ భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే పవిత్రమైన కాశీ నగరంలోని ఈ శివలింగాన్ని తాకితే మాత్రం మృత్యు భయం పోయి మోక్షం లభిస్తుందని చెబుతారు.

మరణ భయాన్ని పోగొట్టే శివలింగం
మరణ భయాన్ని పోగొట్టే శివలింగం (pixabay)

Shivalingam: భూమ్మీద ఉన్న ప్రతి మనిషిని భయపెట్టే విషయం ఏదైనా ఉందంటే అది మరణం మాత్రమే. దీని నుంచి మానవులు ఎల్లప్పుడూ తప్పించుకోలేరు. కానీ మరణ భయాన్ని వదిలిపెడితే మోక్షాన్ని పొంది దైవంతో ఐక్యం కాగలుగుతారు.

మరణ భయాన్ని పోగొట్టేందుకు మహామృత్యుంజయ మంత్రం ఎంతో ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే వాటితో పాటు ఈ శివలింగాన్ని తాకితే కూడా మరణ భయం నుంచి విముక్తి లభిస్తుంది. శాశ్వత శాంతి ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అది ఎక్కడో కాదు పవిత్రమైన కాశీ నగరంలో ఉంది. దాని పేరే అమృతేశ్వర్ శివలింగం.

కాశీ పుణ్యక్షేత్రం దేవుడి సొంతిల్లుగా భావిస్తారు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని విశ్వాసం. భారతదేశంలోనే పురాతన, అత్యంత పవిత్రమైన నగరాలలో కాశీ ఒకటి. ఆధ్యాత్మికతను ప్రేరేపించే ప్రదేశం ఇది. అందరూ తమ ఆత్మ పరమాత్మతో కలవాలని కాశీ నగరం సందర్శిస్తారు. చనిపోయేలోపు ఒక్కసారైనా కాశీ దర్శించాలని కోరుకుంటారు. అలాగే చనిపోయిన తర్వాత తమ అస్తికలు కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే కాశీ నగరం చాలా సంవత్సరాలుగా తీర్థయాత్ర, భక్తి ప్రదేశంగా నిలిచింది. అటువంటి ఈ పవిత్రమైన నగరంలో ఒక శివలింగం ఉంది. దీన్ని అమృతేశ్వర శివలింగం అని పిలుస్తారు.

అమృతేశ్వర శివలింగం వెనుక ఉన్న కథ

అమృతేశ్వర శివలింగం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్కంద పురాణంలోనే కాశీఖండం ప్రకారం ఉపజంగిని ఒక రుషి కుమారుడు. ఒకరోజు తన బిడ్డ మరణశయ్యపై ఉన్నప్పుడు రుషి దహన సంస్కారాలు ఎలా చేయాలో ఆలోచించడానికి అతని మృతదేహాన్ని ఒక ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ మట్టి మీద కొడుకు మృతదేహాన్ని పడుకోబెట్టాడు. అద్భుతం జరిగినట్టుగా బాలుడు మరణాన్ని జయించి లేచాడు.

ఇదంతా రుషి నమ్మలేకపోయాడు. కానీ తన కొడుకు మళ్లీ బతికాడని సంతోషించాడు. అయితే తన కొడుకు బ్రతకడానికి కారణమయ్యింది ఏమిటో తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించాడు. బాలుడిని పడుకోబెట్టిన ప్రదేశం తవ్వగా అందులో ఒక చిన్న శివలింగం కనిపించింది. దాన్ని బయటికి తీశారు. అప్పటి నుంచి శివలింగానికి ఆచారం ప్రకారం పూజలు అందించారు. అదే కాశీలోని అమృతేశ్వర్ శివలింగం. ఈ పవిత్రమైన శివలింగం వల్లే రుషి తన కొడుకు ప్రాణాలు నిలిచాయని నమ్ముతారు. అందుకే ఈ శివలింగానికి అమృతేశ్వర్ అని పేరు వచ్చింది

మరణ భయాన్ని పోగొట్టే శివుడు

సృష్టికర్త, లయకారుడు, భోళాశంకరుడు, పరమేశ్వరుడు ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. సృష్టికర్త, సృష్టి వినాశనకర్త శివుడే. అటువంటి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులలో మరణ భయం తొలగిపోతుంది. మరణాన్ని శాంతితో ఆహ్వానిస్తారు. దైవిక శక్తితో ఐక్యమవుతారు.

శివుడికి అంకితం చేసిన మంత్రమే మహా మృత్యుంజయ మంత్రం. దీని అర్థం కూడా మృత్యు భయాన్ని పోగొట్టడమే. మనస్సు నుంచి మరణ భయాన్ని తొలగించమని వేడుకుంటూ భక్తులు ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. అలాగే ఈ అమృతేశ్వర శివలింగాన్ని తాకడం వల్ల కూడా మృత్యు భయం తొలగిపోతుంది అని భక్తులు విశ్వాసం.

Whats_app_banner