పాపాల నుంచి మోక్షం పొందేందుకు పాపాంకుశ ఏకాదశి ఉపవాసం
Papankusha Ekadashi 2023: దృక్ పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ 25, బుధవారం జరుపుకుంటారు.
ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, ఇతర అంశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
విష్ణువు అవతారమైన పద్మనాభుడిని పాపాంకుశ ఏకాదశి నాడు పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉండి, సకల సంతోషాల కోసం పద్మనాభుడిని ప్రార్థిస్తారు. పేరుకు తగ్గట్టుగానే పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, పద్మనాభుడిని పూజిస్తే పాపపుణ్యాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.
ఏకాదశి ముహూర్తం
దృక్ పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ 25, బుధవారం జరుపుకుంటారు. ఏకాదశి తిథి అక్టోబర్ 24న మధ్యాహ్నం 3:14 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:32 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత పారణ నిర్వహిస్తారు. పారణ అంటే ఉపవాసం విరమించడం. అక్టోబర్ 26వ తేదీ ఉదయం 6:28 నుండి 8:43 వరకు పారణ సమయానికి శుభ ముహూర్తం ఉంది.
పాపాంకుశ ఏకాదశి ప్రాముఖ్యత
పద్మనాభుడి (విష్ణువు) అనుగ్రహం పొందాలనుకునే భక్తులు పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఈ వ్రతాన్ని పాప కర్మల నుండి, జీవితంలో అనుభవించే కష్టాలను దూరం చేయడానికి ఆచరిస్తారు. తెలిసి తెలియక చేసిన తప్పును క్షమించి సమస్యలను పరిష్కరించమని విష్ణువును ప్రార్థిస్తారు. విష్ణువు సంతృప్తి చెంది భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తాడని నమ్మకం. పాపాంకుశ ఏకాదశి ఉపవాసం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి మరియు మోక్షాన్ని పొందవచ్చని కూడా నమ్ముతారు. ఈ పాపాంకుశ ఏకాదశి వ్రతం గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పినట్లు పురాణంలో ప్రస్తావన ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించే వారికి యముడు ఎటువంటి ఇబ్బందిని కలిగించదని కూడా నమ్ముతారు.
ఆచారం, పూజా విధానం
ఈ వ్రతంలో తులసి ఆకులు తీయడం, మద్యం సేవించడం, తామసిక ఆహారాలు తీసుకోవడం నిషేధం. ఉదయాన్నే లేచి నిత్య కృత్యాలు ముగించుకుని పూజ సామాగ్రిని అమర్చి పూలు, ధూపం, దీపం, హారతి సమర్పించి విష్ణుమూర్తికి పూజ చేయాలి. సాయంత్రం ఏకాదశి కథ విన్నా, పఠించినా తర్వాత విష్ణుసహస్రనామ పారాయణం చేసి మళ్లీ ఏకాదశి పూజ చేయండి. హారతి చేసిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఉపవాసాన్ని విరమించవచ్చు.