Kashi: కాశీలో మరణించాలని ఎక్కువమంది హిందువులు ఎందుకు కోరుకుంటారు?-why do most hindus want to die in kashi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kashi: కాశీలో మరణించాలని ఎక్కువమంది హిందువులు ఎందుకు కోరుకుంటారు?

Kashi: కాశీలో మరణించాలని ఎక్కువమంది హిందువులు ఎందుకు కోరుకుంటారు?

Haritha Chappa HT Telugu
Mar 30, 2024 03:33 PM IST

Kashi: కాశీనగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు పవిత్రమైన ప్రదేశం. ఈ కాశీ పట్టనం గంగానది ఒడ్డున విస్తరించి ఉంటుంది. అత్యంత పురాతనమైన నగరాలలో కాశీ ఒకటి.

కాశీ నగరం
కాశీ నగరం

Kashi: కాశీ వీధులు అద్భుతంగా ఉంటాయి. ప్రతి వీధిలో పండితులు మంత్రాలు జపిస్తూ కనిపిస్తారు. అలాగే మరణించిన వారిని తమ భుజాలపై మోసే వ్యక్తులు కూడా సిద్ధంగా ఉంటారు. కాశీ వీధులు కీర్తనలతో మారుమోగిపోతాయి. ఘాట్లు హారతులతో, పూజారులతో నిండి ఉంటాయి. ముక్తిని కోరుకునే యాత్రికులు కాశీకి వస్తూ ఉంటారు. హిందువుల్లో ఎంతోమంది భక్తులు తాము కాశీలోనే మరణించాలని కోరుతూ ఉంటారు. ఎందుకు ఇలా కోరుకుంటారో తెలుసుకుందాం.

కాశీ గురించి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సినది ‘కాశ్య మరణం ముక్తి’. అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం. కాశీలో మరణించడం వల్ల పూర్తి విముక్తి లభిస్తుందని ఎప్పటినుంచో ఒక నమ్మకం ఉంది. పుట్టుక, మరణం అనే ఒక చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుంది. అంటే మరుజన్మ అంటూ ఆ మనిషికి ఉండదు. కాశీలో మరణించడం వల్ల ఆత్మకు ముక్తి లభిస్తుందని, మరుజన్మ ఉండదని హిందువుల నమ్మకం.

సంసారం అని పిలిచే జనన, మరణ చక్రంలో ఇరుక్కుపోయిన మనిషి... మరణిస్తూ మళ్ళీ జనిస్తూ ఉంటాడని హిందువుల నమ్మకం. ఎప్పుడైతే కాశీలో మరణిస్తారో ఆ జీవికి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. పూర్తి మోక్షం లభిస్తుంది. ఆ జీవితచక్రం నుండి బయటపడేందుకు ఎంతో మంది హిందువులు ముక్తి కావాలని కాశీకి వచ్చి మరణించాలని కోరుకుంటారు. కాశీ నగరాన్ని కప్పి ఉంచే శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో మందిని ఆ నగరానికి రప్పించుకుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంతోమంది హిందువులు కాశీలో మరణించాలని కోరుకుంటూ దీనివల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. కాశీలో మరణించడం అనేది స్వర్గానికి సులభమైన మార్గం వంటిదని అనుకుంటారు. హిందూ గ్రంధాలు చెబుతున్న ప్రకారం కాశీలో తుదిశ్వాస విడిచినవారు అన్ని బంధాల నుండి విముక్తులవుతారు. ప్రాపంచిక బాధలు వారికి ఉండవు. శాశ్వతమైన ఆనందం దక్కుతుంది. దైవంతో ఐక్యత అవుతారు.

కాశీ నడిబొడ్డున కాశీ ముక్తిభవన్ ఉంది. ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది హిందువులు మోక్షం పొందేందుకు వస్తారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు చివరి రోజుల్లో ఈ ముక్తి భవన్‌కు చేరుకుంటూ ఉంటారు. కాశీలోనే తమ చివరి రోజులు గడపాలని కోరుకుంటారు. అలాంటివారికి ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతోనే కాశీ ముక్తి భవన్ పనిచేస్తూ ఉంటుంది. ఎంతోమంది ఇక్కడే ఉంటూ తమ తుది శ్వాస విడుస్తారు.

WhatsApp channel

టాపిక్