తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special: రైళ్లు ర‌ద్దుతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అందుబాటులో స్పెషల్ సర్వీసులు

APSRTC Special: రైళ్లు ర‌ద్దుతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అందుబాటులో స్పెషల్ సర్వీసులు

HT Telugu Desk HT Telugu

27 June 2024, 9:03 IST

google News
    • APSRTC Special:  రైల్వే ఆధునీక‌ర‌ణ ప‌నులతో  రాష్ట్రంలో రైళ్లు భారీగా ర‌ద్దు అవ్వ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC Special: రైళ్లు రద్దు కావడంతో ఏపీఎస్‌ ఆర్టీసీ 15 ప్ర‌త్యేక బ‌స్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, తాడేప‌ల్లి గూడెం, కాకినాడ త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో నిడ‌ద‌వోలు-క‌డియం మ‌ధ్య రైల్వే ఆధునీకీక‌ర‌ణ ప‌నుల వ‌ల్ల దాదాపు 45 రోజులు పాటు 15 రైళ్లు ర‌ద్దు అయ్యాయి. ప్ర‌యాణికులు నిత్యం తిరిగే రైళ్లు ర‌ద్దు కావ‌డంతో ప్ర‌యాణికుల‌కు, వ‌ర్త‌కుల‌కు, ఉద్యోగుల‌కు, విద్యార్థుల‌కు ఇబ్బందులు ప‌డుతున్నారు. రద్దైన రైళ్లు కొన్ని ఆగ‌స్టు 9, మ‌రికొన్ని ఆగ‌స్టు ప‌ది మ‌రికొన్ని ఆగ‌స్టు 11ను పునఃప్రారంభం అవుతాయి.

రైళ్లు భారీగా ర‌ద్దు అవ్వ‌డంతో బ‌స్సులు కూడా ఖాళీగా ఉండ‌టం లేదు. దీంతో ప్ర‌యాణికులు సంఖ్య మూడింత‌లు పెరిగింద‌ని అంచ‌నా ప‌డుతున్నారు. అందుకే రాజ‌మండ్రి, తిరుప‌తి, ఏలూరు, తాడేప‌ల్లి గూడెం, కాకినాడ‌, విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల‌కు బ‌స్సు స‌ర్వీసుల‌ను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.

ఏపిఎస్ఆర్టీసీ మొత్తం 15 బ‌స్ స‌ర్వీస్‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ‌ప‌ట్నం జోన్‌-1 ప‌రిధి ద్వార‌కా బ‌స్ స్టేష‌న్ నుంచి 12 ప్ర‌త్యేక స‌ర్వీసులు విజ‌య‌వాడకు ఆర్టీసీ న‌డుపుతుంది. అలాగే విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం నుండి మ‌రో మూడు ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను విజ‌య‌వాడ‌కు న‌డుపుతుంది. ఈ బ‌స్సు స‌ర్వీసులు తుని, అన్న‌వ‌రం, కాకినాడ‌, రాజ‌మండ్రి, నిడ‌ద‌వోలు, తాడేప‌ల్లి గూడెం, ఏలూరు త‌దిత‌ర ప్రాంతాల‌ను క‌లుపుకొని విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయి.

రైళ్లు ర‌ద్దు కావ‌డంతో ప్ర‌యాణీకులు ర‌ద్దీ పెరిగింద‌ని, ఈ నేప‌థ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను న‌డుపుతుంద‌ని డిప్యూటీ చీఫ్ టాఫ్రిక్ మేనేజ‌ర్ (జోన్‌-1 ఆప‌రేష‌న్స్‌) బి. అప్ప‌ల‌నాయుడు తెలిపారు. అలాగే వందే భార‌త్ రైలు ప్ర‌యాణికుల కోసం విశాఖ‌ప‌ట్నం నుంచి విజ‌య‌న‌గ‌రానికి రాత్రి వేళ‌ల్లో ప్ర‌త్యేక స‌ర్వీసు ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

అలాగే పలు రైళ్లు రద్దు, ప్రయాణికుల రద్దీ దృశ్య విశాఖపట్నం, విజయవాడలకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజమండ్రి ఆర్టీసీ ఏండీ ఎస్ కే షబ్నం పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 8 బస్సు సర్వీసులు, విజయవాడకు 13 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిమాండ్ ను బట్టీ మరిన్ని బస్సు సర్వసులను పెంచుతామని పేర్కొన్నారు.

అయితే బస్సు టిక్కెట్టు రేట్లు‌ అధికంగా ఉండటంతో పేద, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా ప్రయాణాలనే రద్దు చేసుకుంటున్నారు. అత్యవసరం అయిన వారు, చిరు వ్యాపారులు, ఉద్యోగాలు చేసేవారు తప్పనిసరి పరిస్థితుల్లో బస్సు సర్వీసులను ఉపయోగిస్తున్నారు.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు ఏసీ ప్రత్యేక సర్వీస్

మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) కు ఏసీ స్లీపర్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సు సర్వీస్ విజయవాడలో రాత్రి 9:45కి బయలుదేరి, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు ఉదయం 4 గంటలకు చేరుకుంటుంది. తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాత్రి 11:55 బయలుదేరి, ఉదయం 5:45కి విజయవాడ చేరుకుంటుంది.

అలాగే గుంటూరు నుంచి హైదరాబాద్ కు స్టార్ లైనర్ బస్సు ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. గుంటూరులో బయలుదేరి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు సర్వీస్ గుంటూరులో రాత్రి 10:45కి బయలుదేరి, హైదరాబాద్ కు ఉదయం 3:47 గంటలకు చేరుకుంటుంది. తిరిగి హైదరాబాద్ నుంచి రాత్రి 11:30 బయలుదేరి, ఉదయం 5:20కి గుంటూరు చేరుకుంటుంది.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం