APSRTC Special Buses : ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - పంచారామాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు, ప్యాకేజీలివే
23 October 2024, 15:03 IST
- ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. విజయనగరం నుంచి పంచారామాలకు స్పెషల్ సర్వీసులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదు ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో విజయనగరం నుంచి బస్సులు బయల్దేరుతాయి. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విజయనగరం నుంచి ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక కేంద్రాలైన పంచారామాల దర్శనం కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్మీకమాసంలో వివిధ శైవక్షేత్రాలు, పంచారామాలు, పిక్నిక్ స్పాట్‌లకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు.
పంచారామాల దర్శనం…
పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించేవారి కోసం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతున్నారు.
ప్రతి ఆదివారం ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు విజయనగరం బస్ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పంచారామాల క్షేత్రాల సందర్శన అనంతరం తిరిగి మంగళవారం తెల్లవారుజామున విజయనరానికి చేరుకుంటాయి.
విజయనగరం నుంచి ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీకి రూ.2 వేలు, అల్ట్రా డీలక్స్ రూ.1,950 టికెట్ చార్జీగా నిర్ణయించారు. టికెట్లను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో, లేదంటే డిపో కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం వారు ప్రయాణించే చోటుకు బస్సు పంపుతామని సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు.
శబరిమలకు ప్రత్యేక బస్సులు:
విజయనగరం నుంచి ఏడు రోజులు యాత్రగా విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, ఫళని, గురువాయూర్, ఎరుమేలి, సన్నిదానం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలం దర్శనం తరువాత విజయనగంర చేరుకుంటుంది.
11 రోజుల యాత్రగా విజయవాడ, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవాని, ఫళని, గురువాయూరు, ఎరుమేలి, సన్నిదానం, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలం వరకు బస్సులను ఏర్పాటు చేశారు.
విజయనగరం నుంచి విశాఖ దర్శిని, అరకు దర్శిని, పుణ్యగిరి, లంబసింగి, అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, టెక్కలి రావివలస తదితర క్షేత్రాలకు, కోరుకున్న స్థలాలకు పిక్నిక్ తీసుకెళ్లేందుకు అద్దె ప్రాతిపదికన బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందుబాటులోని చార్జీలతో బస్సులు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం 9494331213, 995922592, 7382921380 నంబర్లను సంప్రదించాలి.