తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

08 September 2024, 19:27 IST

google News
    • AP Schools Holiday : ఏపీని వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. వాయుగుండం ఎఫెక్ట్ తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం, విశాఖ , పశ్చిమగోదావరి, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

AP Schools Holiday : ఏపీలో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు ఇచ్చారు. భారీ వర్షాలు కారణంగా ఇతర జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికలతో మరో మూడు జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటిస్తూ ఆయన జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవు ప్రకటించారు. నిబంధనలను పాటించకుండా ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తే ఆ పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండం

పశ్చిమ, మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం గత 3 గంటల్లో 13 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 08.30 గంటలకు కళింగపట్నానికి తూర్పున 280 కి.మీ, గోపాలపూర్ (ఒడిశా)కి తూర్పు ఆగ్నేయంగా 230 కి.మీ, పారాదీప్ (ఒడిశా)కి 260 కి.మీ. దక్షిణ-ఆగ్నేయంగా, దిఘా (పశ్చిమ బెంగాల్)కి దక్షిణంగా 390 కి.మీ సమీపంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. వాయుగుండం దాదాపు ఉత్తరం వైపుగా ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలి, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మధ్య ఒడిశాలోని పూరీ, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ లోని దిఘాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, తదుపరి 2 రోజులలో ఒడిశా, గంగా నది పరివాహకం ప్రాంతం, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కాకినాడ, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులతో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తదుపరి వ్యాసం