Notices To RGV : ఆర్జీవీకి మరో షాకిచ్చిన ఏపీ సర్కార్, ఫైబర్ నెట్ నిధుల మళ్లింపుపై నోటీసులు
21 December 2024, 21:54 IST
Notices To RGV : దర్శకుడు ఆర్జీవీకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్జీవీ, వ్యూహం చిత్ర యూనిట్ నగదు చెల్లించారని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ నేపథ్యంలో 15 రోజుల్లో 12 శాతం వడ్డీతో ఈ డబ్బు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఆర్జీవీకి మరో షాకిచ్చిన ఏపీ సర్కార్, ఫైబర్ నెట్ నిధుల మళ్లింపుపై నోటీసులు
Notices To RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించారన్న విషయంపై ఆర్జీవీ, వ్యూహం చిత్ర యూనిట్, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి ఏపీ సర్కార్ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటన చేశారు. ఒక్కో వ్యూకు రూ.100 చెల్లించే నిబంధనలకు విరుద్ధంగా...వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు చెల్లించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఫైబర్ నెట్ మాజీ ఎండీతో సహా ఐదుగురుకి నోటీసులు జారీ చేసినట్లు జీవీ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం నగదు తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
డైరెక్టర్ ఆర్జీవీ.... వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ‘వ్యూహం’ సినిమాకు తెరకెక్కించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2.15 కోట్లకు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకుంది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాలని, కానీ ఒప్పందంలో కేవలం 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని జీవీ రెడ్డి తెలిపారు. ఈ లెక్కన ఒక్కో వ్యూ కు రూ.100 బదులుగా రూ.11,000 చొప్పున చెల్లించారని ఆరోపించారు. అధికంగా నగదు చెల్లించడంపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ జారీ చేశామని జీవీ రెడ్డి తెలిపారు.
ఫైబర్ నెట్ తో ఒప్పందం
దర్శకుడు ఆర్జీవీ వైసీపీ మద్దతుగా పలు సినిమాలు చేశారు. ఏపీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ను కలిసిన ఆయన...దాసరి కిరణ్ కుమార్ అనే నిర్మాత పెట్టుడితో వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీశారు. ఇందులో మొదటి సినిమా వ్యూహం ధియేటర్లలో విడుదలైనా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సినిమాను ఫైబర్ నెట్ లో విడుదల చేశారు. దీనిపై జరిగిన ఒప్పందాన్ని అప్పట్లో బయటపెట్టలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సినిమా లెక్కలు బయటకు తీసింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్న ఆరోపణలతో ఆర్జీవీతో పాటు వ్యూహం చిత్ర యూనిట్, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి నోటీసులు జారీ చేశారు.
15 రోజుల్లో డబ్బు చెల్లించాలి
ఫైబర్ నెట్ లో విడుదలైన ఈ సినిమాకు ఒక్క వ్యూకి రూ.100 చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. మొత్తంగా 1863 వ్యూస్ కు కూడా లేకపోయినా రూ. కోటి పదిహేను లక్షలకు పైగా చెల్లించారని ఫైబర్ నెట్ కొత్త ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందిన డబ్బులను పదిహేను రోజుల్లోగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యూహం, శపథం సినిమాలకు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అయితే దర్శకుడు ఆర్జీవీకి ఎందుకు డబ్బులు చెల్లించారనేది విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం. ముందుగా డబ్బు రికవరీ అయిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు తీసినందుకు ఆర్జీవీకి భారీగా డబ్బు ముట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏ శాఖ నుంచి ఆర్జీవీకి డబ్బులు వెళ్లాయే ప్రభుత్వం ఆరా తీస్తుందని సమాచారం.