తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Vijayawada Metro : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, ఫేజ్-1 డీపీఆర్ లు ఆమోదం

Visakha Vijayawada Metro : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, ఫేజ్-1 డీపీఆర్ లు ఆమోదం

02 December 2024, 21:50 IST

google News
  • Visakha Vijayawada Metro Projects : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులలో కీలక అడుగుపడింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల ఫేజ్-1 డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ఫేజ్-1 లో 46.23 కి.మీ మేర మూడు కారిడార్లు నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 లో 38.4 కి.మీ మేర నిర్మించనున్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్- రూ.22,507 కోట్లతో ఫేజ్-1 డీపీఆర్ లు ఆమోదం
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్- రూ.22,507 కోట్లతో ఫేజ్-1 డీపీఆర్ లు ఆమోదం

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్- రూ.22,507 కోట్లతో ఫేజ్-1 డీపీఆర్ లు ఆమోదం

విజయవాడ(అమరావతి), విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1 రివైజ్డ్ డీపీఆర్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం జీవో జారీ చేసింది. సాగర నగరం విశాఖలో మెట్రో ఫేజ్-1 లో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4 కి.మీల మేర మొదటి కారిడార్‌, గురుద్వార్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.08 కి.మీల మేర రెండో కారిడార్‌, 6.75 కి.మీ మేర తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు మూడో కారిడార్‌ నిర్మించనున్నారు. విశాఖ మెట్రో ఫేజ్-1 లో మొత్తం రూ. 11,498 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫేజ్-2 లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30.67 కి.మీల మేర నాలుగో కారిడార్‌గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

విజయవాడ-అమరావతి మెట్రో డీపీఆర్ ఆమోదం

విజయవాడ-అమరావతి మెట్రో రైల్‌ డీపీఆర్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-1 లో కారిడార్‌ 1ఎ, 1బిగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 38.4 కి.మీ మేర నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను మెట్రో రైల్ కార్పొరేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తొలి దశ పనులకు మొత్తం రూ.11,009 కోట్ల వ్యయం అంచనా వేసింది ప్రభుత్వం. భూసేకరణకు రూ.1152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా మెట్రో రైల్ కార్పొరేషన్ డీపీఆర్‌ సిద్ధం చేసింది. విజయవాడ మెట్రో ఫేజ్-2 మూడో కారిడార్‌ను దాదాపు 27.75 కి.మీల మేర నిర్మించనున్నారు.

విజయవాడ మెట్రో కారిడార్ 1ఎ లో గన్నవరం నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ వరకు, కారిడార్ 1బిలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు, మూడో కారిడార్ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతి వరకు రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మెట్రో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. తాజాగా విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ పనులకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతి తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. మొత్తం 23 అంశాల అజెండాతో జరిగిన ఈ సమావేశంలో రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి, రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ అనుమతించిందన్నారు. ఇక అమరావతిలో గెజిటెట్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీలకు భవనాల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 15లోపు ఐదు ఐకానిక్‌ టవర్లకు డిజైన్లు అందిస్తారని, నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు.

తదుపరి వ్యాసం