తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Metro Projects : విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌పై సర్కార్ కసరత్తు.. 6 ప్రధాన అంశాలు

AP Metro Projects : విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌పై సర్కార్ కసరత్తు.. 6 ప్రధాన అంశాలు

02 November 2024, 9:35 IST

google News
    • AP Metro Projects : ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నం, విజయవాడ నగరాల ప్రజలను మెట్రో ప్రాజెక్టు ఊరిస్తోంది. ఇదిగో ప్రారంభం అవుతుంది.. అదిగో స్టార్ట్ చేస్తున్నాం అని ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. కానీ.. అడుగు ముందుకు పడలేదు. తాజాగా ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
విజయవాడలో ప్రతిపాదిత మెట్రో మార్గం
విజయవాడలో ప్రతిపాదిత మెట్రో మార్గం (@AndhraNexus)

విజయవాడలో ప్రతిపాదిత మెట్రో మార్గం

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. 2024 ధరల ప్రకారం డీపీఆర్‌ల తయారీ పూర్తయ్యింది. విజయవాడ నగరంలో రెండు దశల్లో 3 కారిడార్ల పనులు, విశాఖపట్నంలో రెండు దశల్లో 4 కారిడార్లు పనులు చేపట్టాలని డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 6 ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

1.విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులను సమకూర్చాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

2.విశాఖపట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్ల పనులకు రూ.17,232 కోట్లు, విజయవాడ నగరంలో రెండు దశల్లో మూడు కారిడార్ల పనులకు రూ.25,130 కోట్లు అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.

3.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రబుత్వమే నిధులు ఇవ్వాలని.. ఏపీ ప్రభుత్వం గుర్తుచేసింది. ఈ రెండు నగరాల్లో కలిపి 258 ఎకరాల భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది.

4.రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది. డీపీఆర్‌లు కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి వెళ్లాయి. మెట్రో రైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్రం సూచించింది.

5.2024 ఎన్నికల తర్వాత మళ్లీ మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం డీపీఆర్‌లు సిద్ధం చేసింది. ఆర్థిక పరిమితులు, నిధుల కొరత కారణంగా.. ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేసింది.

6.కోలకత్తా ఈస్ట్ - వెస్ట్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2017 పాలసీ ప్రకారం.. కేంద్రం 100 శాతం నిధులు ఇచ్చింది. అదే మోడల్‌లో విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. అయితే.. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తదుపరి వ్యాసం