PMSYM Scheme : ఇలా చేస్తే నెలకు రూ.3,000 పొందొచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకం- ఇలా అప్లై చేయండి
PMSYM Scheme : అసంఘటిత రంగాల్లోని కార్మికులకు 60 ఏళ్లు నిండిన తర్వాత కేంద్రం ప్రతి నెల రూ.3000 పింఛన్ అందిస్తుంది. ఇందుకోసం కేంద్రం పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన్ పథకాన్ని అమలుచేస్తుంది. పెన్షన్ పొందేందుకు కార్మికులు కొన్నేళ్లు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నెలకు రూ.3,000 పొందొచ్చు. కేంద్రం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన (పీఎంఎస్‌వైఎం) పథకం అమలు చేస్తోంది. ఈ పథకం లక్ష్యం అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే. ఈ పథకం ద్వారా కార్మికులు నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అందులో కార్మికుడు చేసిన కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కూడా నిధులను అందిస్తుంది.
ఈ పథకం ఎలా అమలు చేస్తారు?
ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తరువాత కార్మికులకు ప్రతీ నెలా రూ.3,000 ఫిక్స్‌డ్ పెన్షన్ అందుతుంది. పని చేస్తున్న సమయంలో కార్మికులు చెల్లించే రుసుముతో సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కూడా డిపాజిట్ చేస్తుంది. ఉదాహరణకు ఒక కార్మికుడు నెలకు రూ.200 చెల్లిస్తే, ప్రభుత్వం కూడా అధనంగా రూ.200 జమ చేస్తుంది. పీఎంఎస్‌వైఎం ద్వారా వృద్ధాప్యంలో కార్మికులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. అలాగే వీరు స్వావలంబనం కలిగి ఉండేలా ప్రోత్సాహం అందుతుంది.
ఈ పథకానికి అర్హతలు
18 నుంచి 40 మధ్య వయస్సు కలిగి ఉండాలి. నెలవారి ఆదాయం రూ.15,000 మించకూడదు. సంఘటిత రంగంలోని కార్మికులు, ముఖ్యంగా వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, మిడ్డే మీల్స్, బట్టలు ఉతికేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు అర్హులు. ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులై ఉండకూడదు.
ఇలా అప్లై చేసుకోవాలి?
సమీప కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)కి వెళ్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నామినీ వివరాలు సమర్పించాలి. సమాచారం వెరిఫై చేసిన తరువాత, మీ అకౌంట్ ఓపెన్ చేసి, శ్రమ యోగి కార్డ్ అందిస్తారు. మరింత సమాచారం కోసం మాన్‌ధన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800 267 6888కి కాల్ చేయవచ్చు. ఈ పథకానికి 2024 మధ్యంతర బడ్జెట్‌లో రూ.177.24 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పథకం అసంఘటిత రంగంలోని దాదాపు 42 కోట్ల మంది కార్మికులకు ఉపయోగపడేలా రూపొందించబడింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం