New GST rates : ఎడాపెడా జీఎస్టీ పెంపునకు సిద్ధమవుతున్న ప్రభుత్వం- ఆ ఉత్పత్తులపై 35శాతం వరకు..!
New GST rates : వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ పెంచాలని మంత్రుల బృందం (జీఓఎం) నిర్ణయించింది. పొగాకుతో పాటు ఇతర వస్తువులపై 35శాతం 'స్పెషల్ రేటు' వేయాలని ప్రతిపాదించింది!
పరిశ్రమ వర్గాలు, కస్టమర్స్‌కి షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పలు ఉత్పత్తులపై ఎడాపెడా జీఎస్టీ (వస్తు సేవల పన్ను)ని పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఏరేటెడ్ బేవరేజెస్, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై విధించే జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని మంత్రుల బృందం (జీఓఎం) నిర్ణయించిందని తెలుస్తోంది.
జీఎస్టీ పెంపు కోసం ‘స్పెషల్ రేటు’!
“పొగాకు, సంబంధిత ఉత్పత్తులు, ఏరేటెడ్ పానీయాలపై 35 శాతం ప్రత్యేక రేటును ప్రతిపాదించడానికి జీఓఎం అంగీకరించింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం వంటి నాలుగు అంచెల పన్ను శ్లాబులు కొనసాగుతున్నాయి. 35 శాతం కొత్త రేటును జిఓఎం ప్రతిపాదించింది,” అని ఓ అధికారి తెలిపారు.
బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని జీఓఎం.. పలు రకాల వస్తువులపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది.
రూ.1,500 వరకు ఖరీదైన రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ.1,500 నుంచి రూ.10,000 వరకు ఉన్న దుస్తులపై 18 శాతం, రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారని తెలుస్తోంది.
ఇలా జీఎస్టీ పెంచినా, నికర ఆదాయం ప్రభావం సానుకూలంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 148 వస్తువులపై రేట్ల మార్పులను జీఓఎం ప్రతిపాదించనుంది. ఈ జీఎస్టీ రేట్లపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టబోయో నివేదికను జీఓఎం సోమవారం ఖరారు చేసింది.
రేట్ల హేతుబద్ధీకరణకు మరింత అవకాశం ఉందా లేదా అనేది కౌన్సిల్ నిర్ణయిస్తుందని, హేతుబద్ధీకరణ ప్రక్రియను కాలానుగుణంగా కొనసాగించేలా జీఓఎంను కొనసాగించాలని నిర్ణయించవచ్చని సదరు అధికారి తెలిపారు.
నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ఉండదు లేదా అతితక్కువ ట్యాక్స్ శ్లాబులో అవి ఉంటాయి. లగ్జరీ, డీమెరిట్ వస్తువులు మాత్రం అత్యధిక ట్యాక్స్ రేట్లో ఉంటాయి. కార్లు, వాషింగ్ మెషిన్లు వంటి లగ్జరీ వస్తువులపై ఇప్పటికే 28శాతం జీఎస్టీ ఉంది. వీటి మీద అదనంగా సెస్ కూడా వేస్తారు.
అక్టోబర్‌లో జరిగిన గత సమావేశంలో మంత్రుల బృందం 20 లీటర్లు, అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ తాగునీటిపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. రూ.10,000 లోపు ఖరీదు చేసే సైకిళ్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది.అలాగే ఎక్సర్సైజ్ నోట్‌బుక్‌లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఓఎం ఫిక్స్ అయ్యింది.
రూ.15,000 కంటే ఎక్కువ ధర పలికిన బూట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని గత సమావేశంలో జీఓఎం ప్రతిపాదించింది. రూ.25,000 పైబడిన చేతి గడియారాలపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని అక్టోబర్ 19న జరిగిన సమావేశంలో నిర్ణయించింది.
సంబంధిత కథనం
టాపిక్