Musi River Pollution :మూసీ కాలుష్యంతో భారీ మూల్యం చెల్లిస్తున్న నల్గొండ, తాగునీటికీ కష్టాలు-musi river pollution most affected nalgonda district people ground water polluted causes diseases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Musi River Pollution :మూసీ కాలుష్యంతో భారీ మూల్యం చెల్లిస్తున్న నల్గొండ, తాగునీటికీ కష్టాలు

Musi River Pollution :మూసీ కాలుష్యంతో భారీ మూల్యం చెల్లిస్తున్న నల్గొండ, తాగునీటికీ కష్టాలు

HT Telugu Desk HT Telugu
Oct 02, 2024 07:46 PM IST

Musi River Pollution : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదులలో ఔషధ కాలుష్యంపై స్విస్ కు చెందిన ఓ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో అత్యంత కాలుష్యంగా మారిన నదుల్లో మూసీ ప్రపంచ వ్యాప్తంగా 22వ స్థానంలో ఉంది. మూసీ నది కాలుష్యంతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుంది.

మూసీ కాలుష్యంతో భారీ మూల్యం చెల్లిస్తున్న నల్గొండ, తాగునీటికీ కష్టాలు
మూసీ కాలుష్యంతో భారీ మూల్యం చెల్లిస్తున్న నల్గొండ, తాగునీటికీ కష్టాలు

ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లోని 258 నదులపై స్విస్ ఆర్గనైజేషన్ ప్రపంచ నదులలో ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. అత్యంత కాలుష్యంగా మారిన నదులపై 2022లో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు మూసీ నది 22వ స్థానంలో ఉంది. కనీసం 70 కిలోమీటర్ల మేర 48 రకాల రసాయన అవశేషాలు ఆ పరీక్షల్లో మూసీలో బయట పడ్డాయి. ఈ వివరాలు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌ లో ప్రచురితం అయ్యాయి. ఈ అధ్యయనాల ప్రకారం ఈ కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తోంది. వివిధ రకాల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, గొంతు నొప్పి తదితర రోగాల భారిన పడతారని తేల్చింది.

ఇదీ పరిస్థితి

ఇప్పుడు మూసీ నది శుద్ధీకరణ, సుందరీకరణ జరుగుతున్న ప్రయత్నాలు, మాటలు మంటలు రేపుతున్నాయి. అత్యధిక కిలోమీటర్ల నిడివిలో నల్గొండ జిల్లా గుండా ప్రవహించి రాష్ట్ర సరిహద్దులో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తున్న మూసీ జిల్లా ప్రజలకు ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతోంది. హైదరాబాద్ మురికి నీటితో ఎక్కువగా అవస్థలు పడుతుంది నల్గొండ జిల్లానే. మూసీ పరివాహక ప్రాంతం భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. నకిరేకల్ నియోజకవర్గం సోలిపేట గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. రసాయన కర్మాగారాల కలుషిత విసర్జితాల వల్ల ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికీ కష్టాలు ఏర్పడ్డాయి.

ఈ పరిస్థితుల్లో మూసీ ఆధునీకరణ డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ప్రత్యేక ప్రాజెక్టును డిజైన్ చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడుతున్నారు. " కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ ప్రజలంటే ఎందుకు అంత కోపం?మానవత్వం మరిచి బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారు. మూసీ సుందరీకరణతో పాటు శుద్ధీకరణ చేస్తున్నాం. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతుంటే రాక్షసానందం పొందుతున్న కేసీఆర్ కుటుంబానికి మూసీ సమస్య గురించి ఏమన్నా అవగాహన ఉందా? రజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో పోరాడాల్సి వస్తుంది. మూసీపై తనది దశాబ్ధాల పోరాటం" అని చెప్పుకొచ్చారు.

నల్గొండను చుట్టుముట్టిన ఫ్లోరైడ్, మూసీ కాలుష్య సమస్యలు

నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు.. ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా,ఉపరితల జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైనట్లే నల్గొండ సమస్య పరిష్కారానికి పాలకులు చొరవ చూపలేదు. నల్గొండ భూగర్భంలో ఇంకా ఫ్లోరైడ్ జడలు విప్పుకొని కూర్చుంది. ఈ మధ్యనే వచ్చిన నదులనీటి నాణ్యతా ఇండెక్స్ లో మూసీ రివర్ నీటిలో ఆక్సీజన్ స్థాయిలను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1- 4 మధ్యన ఉండాల్సిన స్థానే, ఇది దామరచర్ల దగ్గర 15గా, వలిగొండ దగ్గర 13గా, వాడపల్లి దగ్గర 13గా ఉంది.

బీఓడీ (బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్) స్థాయిలు 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి.. కానీ వలిగొండ దగ్గర 10.01 శాతం ఉంది. డయేరియా, జ్వరం, చర్మవ్యాధులకు కారణమయ్యే భయంకరమైన కొలిఫాం బ్యాక్టీరియా తాగునీటిలో అసలే ఉండకూడదు. కానీ, దామరచర్లలో 1400గా ఉంది. వలిగొండ ప్రాంతంలో 2200 గా ఉంది. వాడపల్లి దగ్గర 1500గా ఉంది. మూసీ పరీవాహక ప్రాంత పరిధిలో వివిధ కంపెనీలు రసాయన వ్యర్థాలను మూసీలోకి వదిలిపెడుతుండటంతో నది అంతా కాలుష్యంగా మారి నల్గొండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నదులను శుభ్రం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. మూసీ నదిపై నిర్మించిన 24 కత్వాలు, నకిరేకల్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రాజెక్టు వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. కానీ, విష రసాయనాలతో పండించిన పంటలు, కాయగూరల్ని ఎవరు కొనలేని పరిస్థితి నెలకొంది. అదేమాదిరిగా మూసీ తీర ప్రజలంతా మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. మూసీ అంటే.. ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడి. కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ కాలకూట విషం అన్న అభిప్రాయం బలపడింది.

కాటేదాన్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఆజామాబాద్,ఉప్పల్, మల్లాపూర్, నాచారం ఇండ్రస్ట్రియల్‌ ఏరియాల నుండి విష రసాయనాలు నేరుగా మూసీలో వదలేయడ అతి ప్రధాన సమస్యగా మారింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్థ పథార్థాలన్నీ ఇప్పుడు మూసీలోనే కలుస్తున్నాయి. ఈ విషపు నీళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కృష్ణాలో కలుస్తూ..అందరికీ విషాన్ని పంచుతున్నాము. హైదరాబాద్‌లో నిత్యం 2000 ఎంఎల్‌డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తున్నాయి. ఇందులో కేవలం 800 ఎంఎల్‌డీల నీటినే ఎస్‌టీపీల ద్వారా శుద్ది చేస్తున్నారు. మిగతాది శుద్ది లేకుండానే మూసీకి వదులుతున్నారు.

మూసీనదిలో క్యాన్సర్ కారక ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్‌ తదితర రసాయనాలను ఎన్‌జీఆర్‌ఐ తన పరిశీలనలో గుర్తించింది. ఈ నీటితో పండించే పంట ఉత్పత్తుల్లో భార లోహాలున్నట్లు తేల్చారు. ఇవి తింటే కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ భూములు పంటలకు పనికి రాకుండా అవుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, చెరువుల్లో చేపలు, గడ్డిమేసే పశువులు, నీళ్లు తాగే పక్షులు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోయినట్లు పరిశోధనలు తేల్చాయి.

(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )