GST relief : సామాన్యూడికి బిగ్ రిలీఫ్- బీమా ప్రిమియంలతో పాటు వీటిపై జీఎస్టీ కట్..!
GST changes : వచ్చే నెలలో జరగనున్న జీఎస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీమా ప్రీమియంల జీఎస్టీని తొలగించాలని జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించే అంశం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ విషయంపై జీఎస్టీ సభ్యులు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే, సామన్యుడిపై భారం తగ్గుతుంది.

సామాన్యుడిపై జీఎస్టీ భారం తగ్గుతుందా..?
ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కొన్ని బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని, ప్యాకేజ్డ్ వాటర్, సైకిళ్లు వంటి వస్తువులపై పన్నులను తగ్గించాలని శనివారం జరిగిన మంత్రుల బృందం సిఫారసు చేసింది. ఇదే విషయంపై ఆదివారం కూడా సమావేశం జరగనుంది.
సీనియర్ సిటిజన్లకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఓఎం ప్రతిపాదించింది. అదనంగా, రూ .5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీ ఉన్న వ్యక్తులకు కూడా ట్యాక్స్ నుంచి ఉపశమం లభించే అవకాశం ఉంది. అయితే రూ.5 లక్షలకు పైగా కవరేజీ ఉన్న హెల్త్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై ఏర్పాటైన జీఓఎం ప్రత్యేక సమావేశంలో సైకిళ్లు, ఎక్సర్సైజ్ నోట్ బుక్స్, చేతి గడియారాలు, షూలతో సహా రోజువారీ వస్తువులపై పన్ను రేట్లను సవరించడంపై చర్చించారు. వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మార్పులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
"ప్రతి జీఓఎం సభ్యుడు ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నారు. సీనియర్ సిటిజన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం,' అని ఆరోగ్యం, బీమాపై జీఓఎంకు నేతృత్వం వహిస్తున్న బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు.
ఈ ప్యానెల్.. జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పిస్తుందని, ఆ కమిటీదే తుది నిర్ణయమని చౌదరి పేర్కొన్నారు. బీమా సంబంధిత పన్ను అంశాలను పరిశీలించేందుకు సెప్టెంబరులో ఏర్పాటు చేసిన 13 మంది సభ్యుల జీఓఎం తొలి సమావేశం శనివారం జరిగింది.
ప్రతిపాదిత జీఎస్టీ రేటు మార్పులు..
సిఫార్సులను ఆమోదించినట్లయితే..
ప్యాకేజ్డ్ వాటర్ (20 లీటర్లు- అంతకంటే ఎక్కువ) జీఎస్టీని 18% నుంచి 5% కు తగ్గింపు.
రూ.10,000 లోపు ధర కలిగిన సైకిళ్లపై 12 శాతానికి బదులు 5 శాతం పన్ను విధించనున్నారు.
ఎక్సర్సైజ్ నోట్ బుక్స్ కూడా ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్నాయి.
రూ.25,000 కంటే ఎక్కువ ధర కలిగిన చేతి గడియారాలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెరగనుంది.
రూ.15,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే షూలపై 18 శాతం నుంచి 28 శాతం జీఎస్టీ విధించనున్నారు.
నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించడం వల్ల కలిగే ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ఏరేటెడ్ బేవరేజెస్ వంటి లగ్జరీ వస్తువులపై పన్నులను పెంచడంపై జీఓఎం చర్చించింది.
పన్ను సర్దుబాట్ల వల్ల రూ.22,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని జీఓఎం అంచనా వేసింది. బీమా ప్రీమియం మినహాయింపుల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుంది.
2023-24లో ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ ద్వారా రూ.8,263 కోట్లు, హెల్త్ రీఇన్సూరెన్స్ ద్వారా రూ.1,484 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది.
జీఎస్టీ కౌన్సిల్ ప్రస్తుతం 5%, 12%, 18%, 28% పన్ను రేట్లతో నాలుగు అంచెల ప్రక్రియను అనుసరిస్తుంది. నిత్యావసర వస్తువులపై తక్కువ శ్లాబుల్లో పన్ను విధిస్తే, లగ్జరీ వస్తువులపై ఎక్కువ సెస్ విధిస్తున్నారు.
అక్టోబర్ నెలాఖరులోగా తుది నివేదికను జీఎస్టీ కౌన్సిల్ కు సమర్పించే ముందు జీఓఎం ఆదివారం సమావేశం కానుంది.
సంబంధిత కథనం