Tuesday Motivation: ఆశావాదిగా మారండి ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని వెతుక్కోండి
Tuesday Motivation: ఆశావాదికి కష్టాలు కనిపించవు. కేవలం అవకాశాలే కనిపిస్తాయి. మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది. ఆశావాది కూడా అంతే.
సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైనది మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు. కానీ మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు. కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే. అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు. ఒకచోట పడితే మరోచోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి ఇతర జీవులు. కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు. రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు. అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి. ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు. ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి. అదే మీ ఆయుష్షును పెంచుతుంది. ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది.
ఆశావాదికి, నిరాశావాదికి తేడా ఒక్కటే... కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆశావాది అవకాశాన్ని వెతుకుంటాడు. కానీ నిరాశవాది వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఒక ఆశావాది ముందు సగం నిండిన గ్లాసును పెట్టండి... ఇదేమిటి అని అడగండి. ఆశావాది దాంట్లో సగం నీరు నిండి ఉందని చెబుతాడు. అదే నిరాశవాది అయితే నీళ్లు నిండుగా లేవు అని చెబుతాడు. ఉన్న పరిస్థితుల్లోనే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడమే ఆశావాదం. గొప్పవారి విజయ కథలను చదివి చూడండి... అందులో వారు దాటిన కష్టాలు ఎన్నో ఉంటాయి. మొదటి కష్టానికి ఆగిపోతే వారి సక్సెస్ స్టోరీ మనదాకా వచ్చేది కాదు.
రామాయణంలో కూడా హనుమంతుడు ఒకసారి తీవ్ర నిరాశకు గురయ్యాడు. లంకంత తిరిగినా కూడా సీత జాడ దొరకలేదు. ఆ సమయంలో అతనికి ఒక్కసారిగా నిరాశ కమ్ముకుంది. చితిని రగిలించి ఆ చితిలో తన దేహత్యాగం చేయాలనుకున్నాడు. ఆ క్షణంలోని అతనిలోని ఆశావాది బయటకు వచ్చాడు. గుండెల్లో చిన్న ఆశ పుట్టింది. మరొక్కసారి ప్రయత్నిస్తే సీతమ్మ కనిపిస్తుందేమో అన్న ఆశ కలిగింది. వెంటనే తిరిగి ప్రయత్నం కొనసాగించాడు. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. ఆశావాదం చనిపోబోయే వాడిని కూడా బతికిస్తుంది.
విజేత కావాలనుకుంటే పరిస్థితుల నుంచి పారిపోకండి. ఓటమిని ఒప్పుకోండి. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి. విజేతలు ఎవరైనా ఆశావాదంతోనే ముందుకు సాగారు. ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో సక్సెస్ సాధించిన వారందరికి ఉండే ఉమ్మడి లక్షణం ఆశతో జీవించడమే. ఈరోజు కాకపోతే రేపైనా అనుకూల ఫలితాలు వస్తాయనే ఆశ మనల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది. ముందుకే నడిపిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. ఆనందాన్ని ఇస్తుంది. బతుకు మీద ఆసక్తి పెరిగేలా చేస్తుంది. చీకట్లో దీపానికి ఎంత విలువో... మనిషికి ఆశ కూడా అంతే విలువైనది.