Tomato Soup: చలికాలంలో టమోటా సూప్ తాగితే ఎంతో ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సూప్ రెసిపీ ఇలా చేయండి-if you drink tomato soup in winter make this soup recipe to increase your immunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Soup: చలికాలంలో టమోటా సూప్ తాగితే ఎంతో ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సూప్ రెసిపీ ఇలా చేయండి

Tomato Soup: చలికాలంలో టమోటా సూప్ తాగితే ఎంతో ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సూప్ రెసిపీ ఇలా చేయండి

Haritha Chappa HT Telugu
Dec 03, 2024 11:30 AM IST

Tomato Soup: చల్లని వాతావరణంలో టమోటా సూప్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని చలికాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు రాకుండా ఉంటాయి. టమోటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

టమోటో సూప్ రెసిపీ
టమోటో సూప్ రెసిపీ (Pixabay)

శీతాకాలం ప్రారంభం కాగానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినాలి. అలాంటి ఆహారాల్లో టమోటా సూప్ ఒకటి. దీనిలో మనం రోగనిరోధక శక్తిని పెంచే మసాలాలు వేసి వండుతాము. దీన్ని వేడివేడిగా తింటే శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందుతుంది. ఆకలి పుడుతుంది. ఇతర ఆహారాలు తినాలన్న కోరిక కూడా మొదలవుతుంది. టమోటా సూప్ చల్లని వాతావరణంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది రుచిని అందిస్తుంది. టమోటాల్లో క్రోమియం, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, లుటిన్, లైకోపీన్ కెరోటినాయిడ్స్ వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి స్థూలకాయానికి సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. టమోటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

టమోటా సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

టమోటాలు - పావు కిలో

జీలకర్ర పొడి - ఒక స్పూను

నీళ్లు - మూడు కప్పులు

ఉప్పు - రుచికి తగినంత

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

మిరియాల పొడి - ఒక స్పూను

పుదీనా - పావు కప్పు

టమోటా సూప్ రెసిపీ

1. టమోటాలను శుభ్రంగా కడిగి కుక్కర్లో ముక్కలు కోసి వేయాలి.

2. అవి ఉడకడానికి సరిపడా మూడు కప్పులు నీళ్లు వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.

3. తరువాత టమోటాలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

4. ఈ ప్యూరీని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి.

5. సూప్ మరీ చిక్కగా అయితే ఒక కప్పు నీరు వేసి మరిగించాలి.

6. సూప్ మరుగుతున్న సమయంలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా మరిగించాలి.

7. పుదీనా తరుగును అందులో వేసి బాగా మరిగించాలి.

8. ఇది బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టమోటా సూప్ రెడీ అయినట్టే.

టమోటా సూప్ ఉపయోగాలు

టమోటా సూప్‌లో ఉండే సెలీనియం రక్తహీనత నుండి రక్షించడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండాలంటే టమోటా సూప్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టమోటాల్లో ఉండే పొటాషియం శరీరంలో సోడియం లెవల్స్ ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. మీరు హైబీపీ పేషెంట్ అయితే టమోటా సూప్ తినండి. టమోటా సూప్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. టమోటో సూప్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల వ్యక్తికి త్వరగా ఆకలి అనిపించదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చలికాలంలో ప్రజలు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, జీర్ణవ్యవస్థను మెరుగ్గా నిర్వహించడానికి మీరు టమోటా సూప్ తీసుకోవచ్చు. టమోటాల్లో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ కంట్రోల్ కు సహాయపడుతుంది. అంతేకాకుండా టమోటాల్లో ఉండే నారింజిన్ అనే ఫ్లేవనాయిడ్స్ యాంటీ డయాబెటిస్ గా పనిచేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.

Whats_app_banner