Amaravati Capital : అమరావతి రాజధానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పనులు రీస్టార్ట్ చేసేందుకు టెక్నికల్ కమిటీ ఏర్పాటు
24 July 2024, 19:03 IST
- Amaravati Capital : ఐదేళ్ల పాటు ఆగిపోయిన అమరావతి పనులు ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులపై 7 సభ్యులతో ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది.
అమరావతి రాజధానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పనులు రీస్టార్ట్ కు టెక్నికల్ కమిటీ ఏర్పాటు
Amaravati Capital : అమరావతి రాజధానిలో నిలిచిపోయిన పనులపై రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీ రాజధానిలో ఉన్న సమస్యలను గుర్తించి సూచనలు చేయనుంది. ఛైర్మన్ తో సహా మొత్తం ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఆర్ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రతినిధి... సభ్యులుగా ఉన్నారు. ఏపీసీఆర్డీఏలో పనులకు సీఆర్డీఏ సీఈ కన్వీనర్ గాను, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సీఈ వ్యవహరించనున్నారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని నిర్మాణంలో పనులు ప్రస్తుత పరిస్థితిని ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
భవనాల పటిష్టతపై అంచనాలు
మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను టెక్నికల్ కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం పలువురి సలహాలు తీసుకోనుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టం అంచనా వేయనుంది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలించనుంది. పైప్ లు, ఇనుము, ఇతర మెటీరియల్ సామర్థ్యం అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడం, నిలిచిపోయిన అన్ని పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ధిష్టమైన సూచనలు చేయనుంది కమిటీ. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్ లను అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. కమిటీ ఏర్పాటుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల సాయం
కేంద్ర బడ్జె్ట్ లో అమరావతి రూ.15 వేల కోట్లు అందిస్తామని ప్రకటించింది. కేంద్రం వివిధ ఏజెన్సీల ద్వారా రూ.15 వేల కోట్ల రుపాయలను రాజధాని నిర్మాణానికి అందిస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం గ్రాంటుగా ఇవ్వడం లేదని పరోక్షంగా చెప్పినా, ఏజెన్సీల ద్వారా అందిస్తామని చెప్పడంతో అమరావతిలో ప్రపంచ స్థాయి రుణ సంస్థలు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. విదేశీ రుణ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్డడానికి ముందుకు వస్తే మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామక రంగంలో కూడా కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ-గుంటూరు నగరాల మధ్య 2015లో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. 33వేల ఎకరాల విస్తీర్ణంలో రైతుల నుంచి భూములు సమీకరించి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడాదిలోపే ఏపీ సచివాలయ కార్యకలాపాలను వెలగపూడి నుంచి ప్రారంభించారు. 2019వరకు అమరావతి నిర్మాణం వేగంగా జరిగింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. 2019లో ప్రభుత్వం మారే సమయానికి దాదాపు రూ.10వేల కోట్ల రుపాయల బిల్లుల్ని చెల్లించాల్సి ఉంది. గత ఐదేళ్లలో రాజధానిలో నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు తిరిగి ప్రారంభించాలని భావించినా నిధుల సమస్య అందరిని భయపెట్టింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్లో కనీసం సగమైనా చెల్లిస్తే తప్ప పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు. కేంద్ర బడ్జెట్ ప్రకటనలతో అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.