Amaravati Funds: అమరావతి ఊపిరి పీల్చుకో… ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు, తీరనున్న రాజధాని కష్టాలు-amaravati breaths chandrababus successful efforts and the capitals difficulties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Funds: అమరావతి ఊపిరి పీల్చుకో… ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు, తీరనున్న రాజధాని కష్టాలు

Amaravati Funds: అమరావతి ఊపిరి పీల్చుకో… ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు, తీరనున్న రాజధాని కష్టాలు

Sarath chandra.B HT Telugu

Amaravati Funds: ఖజానాలో చిల్లిగవ్వ లేదు, రాజధాని నిర్మాణ పనుల్లో పెండింగ్ బిల్లులే రూ.పదివేల కోట్లకు చేరువలో ఉన్నాయి. రాజధాని నగరం లేని రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ గొప్ప ఊరట ఇచ్చింది.

అమరావతికి ఊపిరి పోసిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన

Amaravati Funds: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెత్తిన పాలుపోసినట్టే అవుతుంది. వివిధ ఏజెన్సీల ద్వారా ఈ నిధుల్ని ఆంధ్రప్రదేశ్‌కు అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఖజానాలో రుపాయి రుపాయి కూడబెట్టుకుంటున్న పరిస్థితుల్లో రాజధాని లేని రాష్ట్రంలో నిర్మాణ పనుల కోసం రూ.15వేల కోట్ల రుపాయలను కేటాయించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి వరంగా మారనుంది. ఈ నిధులు గ్రాంటుగా కేటాయించి ఏపీకి మరింత ప్రయోజనం చేకూరి ఉండేది. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణంపై అపనమ్మకంతో ఉన్న పెట్టుబడిదారులకు కేంద్రం ప్రకటన గొప్ప భరోసాను కల్పిస్తుంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోడానికి కూడా వెండర్లు ఆసక్తి చూపడం లేదు.2014-19మధ్య జరిగిన ఒప్పందాలకు చెల్లింపులు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు, ప్రభుత్వంతో లావాదేవీలు జరిపే కార్పొరేట్ వెండర్లు ఏపీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే భరోసా ఇస్తుండటంతో వారిలో నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ-గుంటూరు నగరాల మధ్య 2015లో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. 33వేల ఎకరాల విస్తీర్ణంలో రైతుల నుంచి భూములు సమీకరించి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడాదిలోపే ఏపీ సచివాలయ కార్యకలాపాలను వెలగపూడి నుంచి ప్రారంభించారు. 2019వరకు అమరావతి నిర్మాణం వేగంగా జరిగింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. 2019లో ప్రభుత్వం మారే సమయానికి దాదాపు రూ.10వేల కోట్ల రుపాయల బిల్లుల్ని చెల్లించాల్సి ఉంది.

గత ఐదేళ్లలో రాజధానిలో నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు తిరిగి ప్రారంభించాలని భావించినా నిధుల సమస్య అందరిని భయపెట్టింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్లో కనీసం సగమైనా చెల్లిస్తే తప్ప పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు.

ఈ నేపథ్యంలో కేంద్రం ఆదుకుంటే తప్ప రాజధాని నిర్మాణం గట్టెక్కే పరిస్థితులు లేవు. కేంద్ర బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్‌ చేసిన ప్రకటనతో అమరావతి ఊపిరి పోసుకున్నట్టు అయ్యింది. రూ.15వేల కోట్ల రుపాయలను వివిధ ఏజెన్సీల ద్వారా ఏపీకి అందించేందుకు కేంద్రం హామీ కల్పించనుంది. అమరావతి కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని నిధులకు సాయం చేస్తామని కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అమరావతి నిర్మాణంలో భాగంగా పలు శాశ్వత నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయి. ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తే అవి వినియోగంలో వస్తాయి. ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లు, జడ్జిల క్వార్టర్లు వివిధ దశల్లో ఉన్నాయి. సెక్రటేరియట్ భవనం పునాదుల్లోనే ఆగిపోయింది. ఉద్దండరాయుని పాలెం నుంచి నిడమర్రు వరకు ఐదు కిలోమీటర్ల పొడవున ఏపీ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం నిధులకు హామీ ఇవ్వడంతో వీటి నిర్మాణం తిరిగి త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు టెండర్లు పిలిచారు.

కొలిక్కి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డు భూసేకరణ…

చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారితో అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించే సీడ్ యాక్సిస్ రోడ్డు భూసేకరణ సమస్యలో ఆరేడేళ్లుగా నిలిచిపోయింది. పెనుమాక, ఉండవల్లి రైతులు భూముల్ని ఇచ్చేందుకు నిరాకరించడంతో రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. కరకట్ట వెంబడి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు మాత్రమే రోడ్డు నిర్మాణం జరిగింది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ మీదు కృఫ్ణా నది వెంబడి కృష్ణా వారధి వరకు రోడ్డు నిర్మాణం చేయాలి.

ఈ రోడ్డు నిర్మాణం రాజధానిలో కీలకం కావడంతో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్.. పెనుమాక, ఉండవల్లిలోని రైతులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంతెన ఆశ్రమం నుంచి కృష్ణానది వెంబడి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపడతారు. దాదాపు 40 ఎకరాల భూసేకరణ కోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు.

రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న చర్చికి ప్రత్యామ్నయ స్థలం కేటాయించడంతో వివాదం పరిష్కారమైంది. ఉండవల్లి పెనుమాకలో భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.