Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి
02 December 2024, 22:51 IST
Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీన రెండు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోలకు టికెట్ ధర రూ.800లుగా నిర్ణయించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి
పుష్ప2 మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా జీవో జారీ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 ది రూల్ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా పుష్ప2 నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 పెంచారు.
పుష్ప2 రిలీజ్ రోజైన డిసెంబర్ 5న ఆరు షోలకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. 5వ తేదీన సింగిల్ స్క్రీన్‌లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200.. జీఎస్టీ ఛార్జీలతో కలిపి పెంచారు. ఇక డిసెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చారు. డిసెంబరు 17 వరకు పెంచిన ధరలు వర్తిస్తాయి. టికెట్ ధరలు పెంపునకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"టిక్కెట్ ధరల పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ దృష్టి చిత్ర పరిశ్రమకు తిరుగులేని ప్రోత్సాహం అందిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో మీరు అమూల్యమైన మద్దతు అందిస్తున్నారు"- అల్లు అర్జున్ ట్వీట్
తెలంగాణలో పుష్ప2 ధరలు పెంపు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా టికెట్ ధరలు భారీగా పెంపునకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా పుష్ప2 ది రూల్ విడుదల కానుంది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. బెనిఫిట్ షోల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లో టికెట్ రేటుపై అదనంగా రూ.800 పెంపు ఖరారు చేసింది.
డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో టికెట్ ధర రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు సింగిల్ స్ట్రీన్ రూ.105, మల్టీప్లెక్స్ లలో రూ.150 చొప్పున టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు మించి అదనపు రేట్లకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు సైతం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.