Allu Arjun : ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌.. రేపు విచారణకు వచ్చే అవకాశం-hero allu arjun filed a petition in andhra pradesh high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Allu Arjun : ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌.. రేపు విచారణకు వచ్చే అవకాశం

Allu Arjun : ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌.. రేపు విచారణకు వచ్చే అవకాశం

Basani Shiva Kumar HT Telugu
Published Oct 21, 2024 12:35 PM IST

Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.

అల్లు అర్జున్‌
అల్లు అర్జున్‌

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును.. క్వాష్‌ చేయాలని పిటిషన్‌ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. దీనిపై మంగళవారం (రేపు) విచారణ జరిగే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మే 12వ తేదీన నంద్యాలలో సినీ అల్లు అర్జున్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి అల్పాహారానికి అల్లుఅర్జున్‌ వెళ్లారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి.

అప్పుడు అల్లు అర్జున్ పర్యటనకు అధికారిక అనుమతులూ లేవు. అయినా.. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో.. అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా.. ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్‌ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది.

అల్లు అర్జున్‌ పర్యటనలో జనసేన జెండాలు కూడా కనిపించాయి. కొంత మంది పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతి తీసుకున్న సమయంలో అల్లు అర్జున్‌ నంద్యాలలో ఎలా పర్యటిస్తారని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ.ఫరూక్‌ ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సినీనటుడు అల్లు అర్జున్‌, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పారవి.. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డికి సన్నిహితుడు. దీంతో ఆయనకు మద్దతుగా నంద్యాలలో ఆకస్మిక పర్యటన చేశారు అల్లు అర్జున్. ఆయన రాకతో నంద్యాల పట్టణం కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వేలాది మంది మద్దతుదారుల మధ్య అల్లు అర్జున, తన భార్య స్నేహారెడ్డితో కలిసి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకుని పుష్ప పుష్ప అంటూ నినాదాలు చేశారు. శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ మద్దతివ్వడం ఇదే తొలిసారి కాదు. 2019లో కూడా అల్లు అర్జున్ అతనికి మద్దతిచ్చి ప్రచారం చేశారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డికి మద్దతుగా నంద్యాలలోని ఆయన నివాసానికి వచ్చారు.

Whats_app_banner