AP DGP Convoy: ఇంతలో ఎంత మార్పు.. డీజీపీకి గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్ రద్దు..
26 January 2024, 10:34 IST
- AP DGP Convoy: ఏపీ డీజీపీ రాకపోకల్లో సమూల మార్పులు చేశారు. గత కొన్నేళ్లుగా డీజీపీల రాకపోకల కోసం అమలు చేస్తున్న గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్‌ను రద్దు చేశారు. సాధారణ వాహనాలతో పాటు డీజీపీ కాన్వాయ్ రాకపోకలు సాగిస్తోంది.
సాధారణ వాహనాలతో కలిసి ప్రయాణిస్తున్న డీజీపీ కాన్వాయ్
AP DGP Convoy: విజయవాడ నగరంలో ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్ నుంచి జనాలకు విముక్తి లభించింది. ఏపీ డీజీపీ రాకపోకల కోసం నిత్యం విజయవాడలో రోజుకు నాలుగైదు సార్లు గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్ అమలు చేస్తుండటంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఎట్టకేలకు ఈ నిబంధనల నుంచి ప్రజలకు మోక్షం లభించింది.
విజయవాడలో కొన్నేళ్లుగా డీజీపీ కోసం గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్ అమలు చేస్తున్నారు. నిత్యం డీజీపీ మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లే సమయంలో, తిరిగి విజయవాడలోని అధికారిక నివాసానికి వచ్చే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.
డీజీపీ ఇంటి నుంచి బయల్దేరి మహాత్మగాంధీ రోడ్డులో యూ టర్న్ తీసుకుని జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో ఐదారు చోట్ల ట్రాఫిక్ ఆపేస్తున్నారు. చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేస్తున్నారు. సరిగ్గా విద్యార్ధులు, ఉద్యోగులు కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఇలాంటి నిబంధనలు అమలు చేయడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
ఈ క్రమంలో ఇటీవల డీజీపీ వాహనాల కాన్వాయ్ విఐపిల రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో అందుకు బాధ్యుడిని చేస్తూ ఓ సిఐను ఏలూరు రేంజ్‌కు అటాచ్ చేశారు.
ఈ వ్యవహారం పెద్ద ఎత్తున జనంలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలకు కింది స్థాయి ఉద్యోగిని బలి చేశారనే విమర్శలు వచ్చాయి. దీంతో పాటు నిత్యం నగరంలో డీజీపీ కాన్వాయ్ పేరుతో ఎదురవుతున్న ఇబ్బందులు చర్చనీయాంశం అయ్యాయి.
ఇప్పటికే తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి బయటకు వస్తే రోడ్ల మీద జనాలకు నరకం కనిపిస్తోంది. తాడేపల్లి నుంచి విజయవాడలో జరిగే కార్యక్రమాలకు సిఎం హాజరు కావాలన్నా, ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాలన్నా గంటల తరబడి వాహనాలను నిలిపి వేస్తున్నారు. మండుటెండలు, భారీ వర్షాలు ఇలా ప్రకృతితో సంబంధం లేకుండా ప్రోటోకాల్ అమలు చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఎన్ని నిరసనలు వచ్చినా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదు.
డీజీపీ ప్రోటోకాల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రేగడంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. తన కాన్వాయ్‌తో సాధారణ ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టమైన సూచనలు చేశారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ కూడళ్లు, యూ టర్న్‌ల వద్ద ప్రజల్ని ఆపొద్దని సూచించారు. దీంతో కొద్ది రోజులుగా డీజీపీ కాన్వాయ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే సమయంలో ఎలాంటి ఆంక్షలు అమలు చేయడం లేదు.
గతంలో డీజీపీ వెళ్లే సమయంలో సాధారణ వాహనాలను రోడ్డుపై అనుమతించే వారు కాదు. జాతీయ రహదారులపై కూడా వాహనాలను పూర్తిగా ఆపేసి డీజీపీ కాన్వాయ్ ప్రయాణించేది. తాజాగా ఈ ఆంక్షలన్నీ తొలగించారు. డీజీపీ కాన్వాయ్‌లో పైలట్ వాహనంతో పాటు మిగిలిన నాలుగైదు వాహనాలు సాధారణ ట్రాఫిక్‌తో పాటు ప్రయాణిస్తున్నాయి. ఆ సమయంలో మిగిలిన వాహనాలను యధావిధిగా రాకపోకలకు అనుమతిస్తున్నారు. డీజీపీ వాహనానికి ఇరువైపులా ఎస్కార్ట్ వాహనాలు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.